Begin typing your search above and press return to search.

తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర.. బీఆర్ఎస్‌కు గేమ్ ఛేంజర్ అవుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

By:  A.N.Kumar   |   17 July 2026 3:45 PM IST
తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర.. బీఆర్ఎస్‌కు గేమ్ ఛేంజర్ అవుతుందా?
X

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వరుస ఎన్నికల ఓటములతో కొంత ఢీలా పడ్డ క్యాడర్‌లో జోష్ నింపడానికి పోగొట్టుకున్న ప్రజాదరణను తిరిగి దక్కించుకోవడానికి ఈ పాదయాత్రను ఒక బ్రహ్మాస్త్రంగా మలచాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాదయాత్ర బీఆర్ఎస్‌కు నిజంగానే ‘గేమ్ ఛేంజర్’ అవుతుందా? దీని వెనుక ఉన్న వ్యూహాలేంటి? తెలుసుకుందాం.

చారిత్రక వ్యూహాలపై అధ్యయనం

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే పాదయాత్రలు ఎప్పుడూ అధికార పీఠాన్ని మార్చే శక్తివంతమైన సాధనాలుగా నిలిచాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ కానీ.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘వస్తున్నా మీకోసం’.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజాసంకల్ప యాత్ర’.. తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వైఎస్ షర్మిల చేసిన పాదయాత్రలు.. ఇవన్నీ ప్రజాభిప్రాయాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాలపై కేటీఆర్ ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఈ యాత్రల ప్లస్ లు, మైనస్ లను విశ్లేషిస్తూ తన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ప్రధాన ఎజెండా.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో జరుగుతున్న ఆలస్యం, లోపాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కేటీఆర్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రైతాంగ సమస్యలను ఫోకస్ చేయనున్నారు. రుణమాఫీ సగం మందికే కావడం, రైతుబంధు/రైతుభరోసా నిధుల విడుదలపై క్షేత్రస్థాయిలో అసంతృప్తిని క్యాష్ చేసుకోవడం. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నియామకాలపై యువతలో ఉన్న అసహనాన్ని బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడం... ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యాలు, గ్రామీణాభివృద్ధి కుంటుపడటం వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా మార్చుకోనున్నారు.

పార్టీ క్యాడర్‌కు కొత్త ఊపు

బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు నాయకులు ప్రజలకు కొంత దూరమయ్యారనే విమర్శ ఉంది. ఇప్పుడు నేరుగా ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా ఆ దూరాన్ని తగ్గించుకోవాలని కేటీఆర్ యోచిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకం కావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడికి క్యాడర్ ఎప్పుడూ అండగా ఉంటుందనే నమ్మకం బీఆర్ఎస్ నాయకత్వంలో వ్యక్తమవుతోంది.

గేమ్ ఛేంజర్ అవుతుందా?

కేటీఆర్‌కు అర్బన్ ఏరియాల్లో, యువతలో మంచి క్రేజ్ ఉంది. కానీ ఈ పాదయాత్ర ద్వారా ఆయన గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాలకు ఎంతవరకు కనెక్ట్ కాగలరనే దానిపైనే బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు కేటీఆర్ ఎక్కువగా హైటెక్, డెవలప్‌మెంట్, ఐటీ లీడర్‌గా ముద్రపడ్డారు. ఈ పాదయాత్ర ఆయనను సంపూర్ణంగా ప్రజా నాయకుడిగా మార్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ యాత్ర అనుకున్నట్లుగా సాగి.. ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తే మాత్రం.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసి, బీఆర్ఎస్‌కు ఇది ఖచ్చితంగా పెద్ద 'గేమ్ ఛేంజర్' అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే షెడ్యూల్ , రూట్ మ్యాప్ ఖరారైన తర్వాతే దీనిపై మరింత స్పష్టత రానుంది.