హాట్ టాపిక్: లోకేశ్ నాటి డైలాగుల్ని కేటీఆర్ నేడు కాపీ కొడుతున్నారా?
ఆ మాటకు వస్తే.. లోకేశ్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వేళలో.. తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అత్యంత శక్తివంతమైన నేతగా ఒక వెలుగు వెలుగుతున్న పరిస్థితి.
By: Tupaki Desk | 19 July 2025 10:12 AM ISTరాజకీయాల్లో ఒక్కో నేతది ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే.. అప్పటివరకు అండర్ డాగ్ మాదిరి.. ఎలాంటి అంచనాలు లేకుండా.. ప్రజల్ని ఆకట్టుకునే విషయంలో వెనుకబడి ఉన్నాడన్న విమర్శలు ఎదుర్కొంటూ.. సోషల్ మీడియాలో తరచూ ఎటకారపు కామెంట్లతో విరుచుకుపడే నేత.. అందుకు భిన్నంగా శక్తివంతమైన నేతగా అవతరించటం చాలా అరుదైన పరిణామంగా చెప్పాలి. ఏపీ మంత్రి నారా లోకేశ్ విషయంలో ఇది నిజమైంది. ఆయన వాచకం మొదలు.. ఆయన రూపం వరకు ఎన్నెన్ని రకాలుగా వేధింపులకు గురి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ మాటకు వస్తే.. లోకేశ్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వేళలో.. తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అత్యంత శక్తివంతమైన నేతగా ఒక వెలుగు వెలుగుతున్న పరిస్థితి. అప్పట్లో కొన్ని సందర్భాల్లో కేటీఆర్ మాట సాయం కోసం లోకేశ్ మాట్లాడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితికి భిన్నంగా కాలం తీసుకొచ్చే మార్పులతో అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేని నేతగా ఉన్న లోకేశ్ ఇప్పుడు మహా శక్తిగా మారితే..అప్పట్లో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న కేటీఆర్ ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు.
పార్టీ క్యాడర్ ను.. ప్రజల్ని ఆకట్టుకోవటానికి ఆయన పడుతున్న పాట్లు అన్నిఇన్ని కావు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కేటీఆర్ తన స్టైల్ కు భిన్నంగా ఇటీవల కాలంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదే పనిగా నోటికి పని చెబుతున్నారు. అధికార పక్ష నేతలపైనా.. ముఖ్యంగా ముఖ్యమంత్రిని అదే పనిగా టార్గెట్ చేసుకొంటూ విమర్శల వర్షం కురిపించటమే కాదు.. ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు పోలీసు అధికారులపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ నేతలపై దాడులు చేశారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో దాడికి గురైన గౌతంనగర్ కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్ ను పరామర్శించిన కేటీఆర్.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చంపేస్తానని ఒక మాజీ మంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే హెచ్చరిస్తే.. కేసు కాదా? అంటూ మండిపడ్డారు.
‘ఇదొక రాష్ట్రం. ఇదో పోలీస్ వ్యవస్థనా? సన్నాసులు.. పిరికిపందలు ఈ పోలీసులు. ఒక్కొక్కడి పేరు రాసుకోండి. ఏసీపీలు.. డీసీపీలు.. సీఐలు.. ఎస్ఐలు.. ఎవడెవడైతే బాగా ఎగురుతడో.. నేను ప్రామిస్ చేస్తున్నా. నెక్ట్స్ టైం కేసీఆర్ చెప్పినా నేను వినను. ఎందుకంటే నేనైతే మంచోడిని కాదు. మళ్లీ మా టైం వస్తది. బానిసల్లా పని చేస్తున్న అధికారులకు చెబుతున్నా. మా ప్రభుత్వం వచ్చినంక మిమ్మల్ని ఒక్కొక్కర్ని ఏం చేయాలో రాసి పెడ్తున్నం. చేసి చూపెడతాం’ అంటూ చేసిన హెచ్చరికలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఏపీలో తమ నేతల్న.. తమ పార్టీ క్యాడర్ ను టార్గెట్ చేసిన అధికారపక్ష నేతల్ని ఉద్దేశించి లోకేశ్ ఇదే తీరులో రియాక్టు అయ్యేవారు. ఆ సందర్భంగానే తాను రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటున్నట్లుగా ఆయన పేర్కొనేవారు. ఇప్పుడు కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. గతంలో లోకేశ్ నోటి నుంచి వచ్చిన ఫైరింగ్ డైలాగుల మాదిరి ఉండటమే కాదు.. మరో అడుగు ముందుకు వేసినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
