Begin typing your search above and press return to search.

కేటీఆర్ వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయా ?

కేటీఆర్ కి కావాల్సింది సీఎం రేవంత్ రెడ్డికి గురి పెట్టడం. పైగా హెచ్.సి.యూ భూములను పదివేల కోట్లకు అమ్మేశారు అన్నది ప్రధాన ఆరోపణ. ఇది సెంటిమెంట్.

By:  Tupaki Desk   |   28 July 2025 9:31 AM IST
KTRs Strategy on HCU Lands Turns Boomerang
X

బీఆర్ఎస్ కి భవిష్యత్తు నాయకుడిగా కేటీఆర్ ఉన్నారు. అయితే కేసీఆర్ తరువాత అంతటి వ్యూహ రచనా చాతుర్యం ఆయనలో ఉందా అన్న సందేహాలు అయితే పార్టీ లోపలా బయటా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ మౌనంతో ఎన్నో వ్యూహాలను రచించి ప్రత్యర్ధులకు చిక్కకుండా దొరకకుండా రాజకీయంగా చెలగాటమాడేవారు అని పేరు. ఆయనను అందుకే అపర చాణక్యుడు అంటారు. ఇక కేటీఆర్ చూస్తే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ఆయన కొన్ని సందర్భంలో ఆవేశంతో చేస్తున్న వ్యాఖ్యలే చివరికి అటూ ఇటూ తిరిగి గులాబీ పార్టీ తోటకే చిచ్చు పెడుతున్నాయని అంటున్నారు.

సీఎం రమేష్ తో కెలుక్కుని :

కేటీఆర్ కి కావాల్సింది సీఎం రేవంత్ రెడ్డికి గురి పెట్టడం. పైగా హెచ్.సి.యూ భూములను పదివేల కోట్లకు అమ్మేశారు అన్నది ప్రధాన ఆరోపణ. ఇది సెంటిమెంట్. ప్రభుత్వ భూములను అమ్మారు అన్నది జనంలోకి పోనీయడం ద్వారా కాంగ్రెస్ సర్కార్ ని బదనాం చేయాలన్నది ఒక వ్యూహం. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. ఈ విషయంలో ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సాయం తీసుకున్నారని దానికి ప్రతిగా ఆయనకు ఫోర్త్ సిటీలో 1600 కోట్ల రూపాయల పనులను సీఎం రమేష్ కు రేవంత్ రెడ్డి అప్పగించారు అని ఆరోపించారు. ఇది తీవ్ర ఆరోపణ. పైగా రిటర్న్ గిఫ్ట్ అన్నారు.

సీన్ లోకి ఎంట్రీతోనే :

ఇక ఈ ఆరోపణల మీద నిజంగా రియాక్ట్ కావాల్సింది కాంగ్రెస్. ఎందుకంటే హెచ్.సి.యూ భూముల మీద పెద్ద బండ వేశారు కాబట్టి. కానీ సీఎం రమేష్ ఎంట్రీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఆయన మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేశారు. ఢిల్లీకి వచ్చి తనను కలిసారు అని కవిత అరెస్టు సమయంలో ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు. అంతే కాదు బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తామని చెప్పారని కూడా ఆయన సంచలన ఆరోపణలే చేశారు.

బీజేపీ సైతం అదే మాట :

ఇక బీజేపీ కూడా ఫీల్డ్ లోకి వచ్చేసింది. సీఎం రమేష్ కేటీఆర్ మీద చేసిన ఆరోపణలు అన్నీ కరెక్ట్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబుతున్నారు. ఆయన ఇంకా ముందుకెళ్ళి కేటీఆర్ మొదటి సారి పోటీ చేసినపుడు సిరిసిల్లాలో ఆయన గెలుపునకు సీఎం రమేష్ ఆర్ధికంగా సాయం చేశారు అని మరో విషయం చెప్పారు. దీంతో ఇపుడు కేటీఆర్ వ్యాఖ్యల సంగతేమో కానీ బీఆర్ ఎస్ ఇరుకున పడినట్లు అయింది అని అంటున్నారు.

కొసరు విషయమే హైలెట్ :

ఇక హెచ్.సి.యూ భూముల వ్యవహారంతో రాజకీయ రాధాంతం జరుగుతుందని అది కాంగ్రెస్ ని ఇబ్బంది పెడితే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ వేసుకున్న అంచనాలు వేరేగా అయ్యాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో హైలెట్ అవుతోంది. నిజంగా అలా జరిగిందా అలా అని ఉంటారా అన్నదే ఇపుడు హాట్ టాపిక్. దాంతో ఈ కామెంట్స్ మీద జవాబు చెప్పలేక బీఆర్ఎస్ సతమతమవుతోంది. ఎప్పటికీ బీజేపీలో బీఆర్ ఎస్ విలీనం కానే కాదు అని గులాబీ నేతలు అంటున్నా విషయం మాత్రం జనాల్లోకి వెళ్ళిపోయింది.

బీఆర్ఎస్ కి బిగ్ ట్రబులేనా :

బీజేపీ చూస్తే జాతీయ పార్టీ. పైగా తెలంగాణాలో ఆ పార్టీ మూడవ స్థానంలో ఉంది. విలీనం వార్తల వల్ల నష్టం ఎక్కువగా జరిగేది బీఆర్ఎస్ కే అని అంటున్నారు. బీఆర్ఎస్ కి మైనారిటీలు సహా అన్ని వర్గాల మద్దతు అవసరం. దాంతో ఈ రకమంగా జనంలోకి వెళ్తే కాదు అని పెద్ద గొంతుతో ఎంతగా చెప్పినా అనుమానాలు అయితే వెళ్తాయని అని అంటున్నారు. మొత్తానికి సీఎం రమేష్ ని మధ్యలోకి తేవడం కాదు కానీ కేటీఆర్ అనుకున్నది ఒకటి జరిగింది మరోటి అయిందని అంటున్నారు. టోటల్ గా కాంగ్రెస్ ఈ ఇష్యూలో సేఫ్ జోన్ లో ఉంటే బీఆర్ఎస్ కార్నర్ అయిందని మొత్తం బూమరాంగ్ అయిందని అంటున్నారు.