Begin typing your search above and press return to search.

రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్

తెలంగాణ రాజకీయ వేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన ఒక బహిరంగ సవాల్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.

By:  A.N.Kumar   |   18 July 2026 8:00 PM IST
రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్
X

తెలంగాణ రాజకీయ వేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన ఒక బహిరంగ సవాల్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన 'యువ సంగ్రామం' సభలో కేటీఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న 70 వేల ఉద్యోగాల గణాంకాలు అబద్ధమని.. వాటిని నిరూపిస్తే తాను రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతానని ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

యువ సంగ్రామం వేదికగా కాంగ్రెస్‌పై విమర్శల అస్త్రాలు

ఈ సభలో ప్రధానంగా నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణ, యువత భవిష్యత్ వంటి అంశాలపై కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఎన్నికల సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ఆ హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. ఆ సంఖ్యకు సంబంధించిన పూర్తి ఆధారాలను, నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియ, నియామక ఉత్తర్వులతో సహా ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. "రేవంత్ రెడ్డి నిజంగా 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని పూర్తి వివరాలతో నిరూపిస్తే.. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను" అని కేటీఆర్ సవాల్ విసిరారు.

గత తప్పిదాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ సభలో కేటీఆర్ కేవలం విమర్శలకే పరిమితం కాకుండా తమ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని పరిణామాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల అంశాన్ని ఆయన పరోక్షంగా అంగీకరించారు. ఆ ఘటనలపై సరైన సమయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం తమ పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన కొన్ని తప్పిదాల వల్లే యువతలో, ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని దాని ప్రభావమే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందనే సంకేతాలను కేటీఆర్ ఇచ్చారు.

యువత మద్దతు కోసమేనా?

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ 'యువ సంగ్రామం' సభ ద్వారా బీఆర్ఎస్ కోల్పోయిన యువత, విద్యార్థుల మద్దతును తిరిగి సాధించాలని ప్రయత్నిస్తోంది. నిరుద్యోగ భృతి, కొత్త నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలను లేవనెత్తుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కేటీఆర్ ఈ సవాల్ విసిరారు. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీలో జాప్యం వంటి అంశాలు ఇప్పటికీ నిరుద్యోగుల మదిలో బలంగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఉద్యోగాల భర్తీ గణాంకాలపై కూడా భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి.

రేవంత్ సర్కార్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?

ఇప్పుడు కేటీఆర్ విసిరిన ఈ పవర్‌ఫుల్ సవాల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి శ్వేతపత్రాన్ని లేదా ఆధారాలను బయటపెట్టి కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తుందా? లేక దీనిని కేవలం రాజకీయ విమర్శగానే కొట్టిపారేస్తుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏదేమైనా కేటీఆర్ చేసిన ఈ "రాజకీయ సన్యాసం" కామెంట్స్ మాత్రం ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్నాయి.