ఏమిటీ ఫార్ములా - ఈకారు రేస్? రెండోసారి కేటీఆర్ ను విచారణకు ఎందుకు?
రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ పోటీలకు సంబంధించి రూ.55 కోట్ల దుర్వినియోగం జరిగినట్లుగా ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది.
By: Tupaki Desk | 14 Jun 2025 9:34 AM ISTకేసీఆర్ పదేళ్ల (తొమ్మిదిన్నరేళ్లు) పాలనలో నిర్వహించిన కార్యక్రమాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన ప్రోగ్రాం ఫార్ములా ఈ కారు రేస్. కలలో కూడా ఊహించని విధంగా ప్లాన్ చేసిన ఈ ఫార్ములా కారు రేసింగ్ సందర్భంగా అత్యంత రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్.. ప్రసాద్ ఐమాక్స్ ప్రాంతంలో ట్రాఫిక్ ను ఆపేసి మరీ.. నిర్వహించిన ఈ పోటీలు నిత్యం లక్షల మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లు మాత్రం అదరహో అన్నట్లుగా నిర్వహించారు.
రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ పోటీలకు సంబంధించి రూ.55 కోట్ల దుర్వినియోగం జరిగినట్లుగా ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు పేర్లను ఏసీబీ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. ఏ1 గా కేటీఆర్.. ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్.. ఏ3గా హెచ్ఎండీఏ మాజీ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు.
ఈ ముగ్గురిని వేర్వేరు సమయాల్లో ఏసీబీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కొంత సమాచారాన్ని సేకరించిన ఏసీబీ.. మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ ను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గ్రీన్ కో ఏస్ నెక్ట్స్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ ను కూడా ప్రశ్నించింది. వీరిని విచారించిన మూడు నెలల తర్వాత ఇప్పుడు మరోసారి కేటీఆర్ ను విచారించాలని నిర్ణయించటం ఆసక్తికరంగా మారింది. మొదటిసారి ఈ జనవరిలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనవరి ఆరున లాయర్లతో కలిసి విచారణకు హాజరైన కేటీఆర్ కు న్యాయవాదుల్ని అధికారులు అనుమతించలేదు. దీంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. జనవరి ఎనిమిదిన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ విచారణను ఎదుర్కొన్నారు కేటీఆర్. విచారణ జరిగిన మూడు నెలల తర్వాత తాజాగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు.
