కేటీఆర్ పుష్ప2 శ్రీలీల ఐటెం సాంగ్ తో పోల్చిన రేవంత్.. వైరల్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాన్‌ను సృష్టించాయి.
By: Tupaki Desk | 9 Nov 2025 8:55 PM ISTతెలంగాణ రాజకీయాల్లో మరోసారి అగ్గి రాజుకుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాన్‌ను సృష్టించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని సినీ నటి శ్రీలీల నటించిన 'పుష్ప 2' ఐటమ్ సాంగ్‌తో పోల్చడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, కేటీఆర్ ప్రచార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో పోలిక
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “సాధారణంగా సినిమాల్లో ఐటమ్ సాంగ్‌లు ప్రేక్షకులను కేవలం అలరించడానికి మాత్రమే ఉంటాయి. వాటికి ఎటువంటి సారాంశం లేదా స్ఫూర్తి ఉండదు. అలాగే కేటీఆర్ ప్రచారం కూడా ఉంది,” అని ఎద్దేవా చేశారు. “ఆయన జూబ్లీహిల్స్‌లో పార్టీ కండువా ఊపుతూ రోడ్లపై నృత్యం చేస్తూ తిరుగుతున్నారు. తెలంగాణ నాయకుడిగా చెప్పుకునే వ్యక్తి ఇలాంటి చిలిపి పనులు చేయడం సరైనదా? పుష్ప సినిమాలో శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్, కేటీఆర్ ప్రచారం మధ్య పెద్ద తేడా లేదు. ఇద్దరిదీ ఒకే రకం వినోదం ప్రజలకు సరదా కానీ సారాంశం లేని షో ” అని విమర్శించారు.
డ్రగ్స్ సంస్కృతిపై కేసీఆర్ కుటుంబంపై విమర్శలు
ప్రచార శైలిపై విమర్శలతో పాటు జూబ్లీహిల్స్ పరిసరాల్లో పెరుగుతున్న డ్రగ్స్ సమస్యలు, సినీ ప్రముఖులతో గెస్ట్ హౌస్ చర్చలు, డ్రగ్స్ వాడకం వంటి అంశాలపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. “ఇలాంటి సంస్కృతిని తెలంగాణకు ఎవరు తెచ్చారు? కేసీఆర్ నేర్పిన అదే సంస్కృతి ఇప్పుడు వారినే దెబ్బతీస్తోంది ” అని ఆరోపించారు. మాదకద్రవ్యాల వాడకానికి, గెస్ట్ హౌస్ వ్యవహారాలకు బీఆర్ఎస్ నాయకులే కారణమని పరోక్షంగా చురకలంటించారు.
బీఆర్ఎస్ శ్రేణుల మండిపాటు
సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో “శ్రీలీల సాంగ్ – కేటీఆర్ క్యాంపెయిన్ పోలిక” హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రతిదాడికి దిగాయి. “ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వ్యక్తిగత స్థాయిలో దిగజారడం సరికాదు. ఇది సీఎం స్థాయికి తగదు ” అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
మొత్తానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం ఊపందుకున్న క్రమంలో రేవంత్–కేటీఆర్ మధ్య మాటల దాడులు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి
