బీజేపీలో విలీనం.. కేటీఆర్ పై సీఎం రమేష్ బిగ్ బాంబ్
సీయం రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు కేటీఆర్ ఇటీవల చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
By: Tupaki Desk | 27 July 2025 10:53 AM ISTతెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేపే ఆరోపణలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్ ప్రయత్నించారని, దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్ తన వద్ద ఉందని బీజేపీ ఎంపీ సీయం రమేష్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నేత కవిత, బీజేపీతో జట్టు కట్టే ప్రసక్తే లేదని, అలాంటి నిర్ణయం తీసుకుంటే తాను వ్యతిరేకిస్తానని వ్యాఖ్యానించిన మరువకముందే, సీయం రమేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కేటీఆర్ ఇంటికి వచ్చి విలీనం ప్రతిపాదించారు: సీయం రమేష్
శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సీయం రమేష్ "కొన్ని నెలల క్రితం కేటీఆర్ మా ఇంటికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కేసులు పెట్టకుండా ఉండాలని కోరారు. ఈ విషయానికి సంబంధించి నా దగ్గర వీడియో రికార్డింగ్ కూడా ఉంది " అని కుండబద్దలు కొట్టారు. ఈ విషయం ఇంతకాలం బయటపెట్టకపోవడానికి కారణాన్ని కూడా సీయం రమేష్ వివరించారు. "అప్పుడు అది ప్రైవేట్ చర్చగా జరిగింది. అందుకే మీడియాతో పంచుకోలేదు. కానీ ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చూసి నిజాన్ని బయటపెట్టాల్సి వస్తోంది " అని తెలిపారు. అంతేకాకుండా "కేటీఆర్ నిజంగా నా ఇంటికి రాలేదని చెప్పగలరా? దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి," అంటూ ఆయన కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్ గానే ఈ వ్యాఖ్యలు?
సీయం రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు కేటీఆర్ ఇటీవల చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ "తెలంగాణలో భారీ ప్రాజెక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీయం రమేష్ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది " అని ఆరోపించారు. ఇందులో భాగంగా రూ.1600 కోట్ల విలువైన 'ఫోర్త్ సిటీ రోడ్' కాంట్రాక్టును రమేష్‌కు అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలే సీయం రమేష్‌ను రెచ్చగొట్టాయని, అందుకే ఆయన వీడియో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో పెనుగులాట ఖాయం
సీయం రమేష్ వ్యాఖ్యలు, వీడియో ప్రూఫ్ ఉన్నాయన్న ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో భారీ పెనుగులాటకు దారితీసే అవకాశముంది. నిజానిజాలు ఏవైనా, ఈ ఆరోపణలు వాస్తవమైతే రాష్ట్ర రాజకీయాల్లో భూమి కంపించేలా చేయడం ఖాయం. ఈ వ్యవహారంపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో, సీయం రమేష్ ఆ వీడియోను ఎప్పుడు విడుదల చేస్తారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
