తోక పార్టీగా గేలి చేసి.. ఇప్పుడు మద్దతుకు ఫోన్ చేసుడేంది కేటీఆర్?
అధికారంలో చేతిలో ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
By: Garuda Media | 15 Feb 2026 11:54 AM ISTఅధికారంలో చేతిలో ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అతిశయాల్ని పలుకుతూ.. అహంకారాన్ని ప్రదర్శిస్తే జరిగే నష్టం ఎంత ఉంటుందన్న దానికి నిదర్శనంగా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతల పరిస్థితి రోజులు గడిచే కొద్దీ మరింత దారుణంగా మారుతోంది. రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత నుంచి గులాబీ పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. వాస్తవాల్ని గుర్తించలేని గుడ్డితనం ఆ పార్టీ అధినాయకత్వంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
అదే.. ఆ పార్టీకి శాపంగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ పార్టీ బలం తగ్గుతూ వస్తోంది. తాజాగా విడుదలైన స్థానిక ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు సీపీఐ పార్టీకి తోక పార్టీగా అభివర్ణించి.. ఆ పార్టీ నేతల్ని గంటల పాటు తన ఆఫీసు బయట వెయిట్ చేయించిన ఘన చరిత్ర కేసీఆర్ సొంతం. ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళ.. కమ్యునిస్టు పార్టీలతో ఆయన వ్యవహరించిన తీరును చూసి.. ఎంతైనా రాజకీయ పార్టీ. అలాంటి పార్టీ విషయంలో ఇంతటి అహంకారం అవసరమా? అన్న ప్రశ్న పలువురిలో వ్యక్తమైంది.
అంతేకాదు.. వామపక్షాల ప్రస్తావన వచ్చినప్పుడు తోక పార్టీలుగా పేర్కొంటూ ఎటకారం కేసీఆర్ చేస్తే.. ఇప్పుడు ఆయన కొడుకు అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి బలంతో కొన్నిచోట్ల అధికారాన్ని షేర్ చేసుకునే వీలుంది. లేదంటే.. తమ మద్దతు వారికి ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన స్థానిక సంస్థల్ని దక్కకుండా చేయొచ్చు. ఈ ఉద్దేశంతో కేటీఆర్ తనకు తానుగా సీపీఐ పార్టీ ముఖ్యనేత కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేసి.. అన్ కండీషనల్ మద్దతు ప్రకటించారు. తమ పార్టీ సీపీఐకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఇదంతా చూసినప్పుడు.. పరిస్థితులు బాగున్నప్పుడు తమకు మించిన మొనగాళ్లు మరెవరూ లేరన్నట్లుగా వ్యవహరించే తీరు.. కాలం కలిసి రాకపోతే.. కాళ్లు పట్టుకోవటానికి సిద్ధమయ్యే వ్యవహారశైలి కేటీఆర్ లో కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇప్పటికైనా తన మాట విషయంలో కేటీఆర్ కాస్తంత ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.
