Begin typing your search above and press return to search.

కేటీయార్ 'బ్లఫ్' చేస్తున్నారా ?

విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేసేది చాలా తక్కువ. అధికారంలో ఎవరుంటే వాళ్ళు తమకు అనుకూలంగా ఉన్న ఒప్పందాలు చేసుకోవటంతోనే జనాలనెత్తిన ఛార్జీల బాదుడు పడుతోంది.

By:  Tupaki Desk   |   30 Oct 2023 12:30 PM GMT
కేటీయార్ బ్లఫ్ చేస్తున్నారా ?
X

విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేసేది చాలా తక్కువ. అధికారంలో ఎవరుంటే వాళ్ళు తమకు అనుకూలంగా ఉన్న ఒప్పందాలు చేసుకోవటంతోనే జనాలనెత్తిన ఛార్జీల బాదుడు పడుతోంది. దీనికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడాఏమీ లేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే కేటీయార్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే వార్తని తమ హయాంలో కరెంటు పోతే వార్తని చెప్పుకున్నారు.

పనిలోపనిగా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఇళ్ళకు కూడా కరెంటు కష్టాలు తప్పడం లేదని ఆరోపణలు గుప్పించారు. కర్నాటకలో సంగతిని పక్కన పెట్టేస్తే తెలంగాణాలో కూడా ఇళ్ళకు కరెంటు రెగ్యులర్ గా పోతునే ఉంది. హైదరాబాద్ లోని చాలా చోట్ల కరెంటు సరఫరాలో అంతరాయం వస్తునే ఉంది. వారం రోజులు లెక్కేస్తే కరెంటు పోని రోజులు తక్కువనే చెప్పాలి.

విషయం ఏమిటంటే దోమలగూడ, హిమాయత్ నగర్ లాంటి కీలక ప్రాంతాల్లో కూడా రోజూ కరెంటు పోతునే ఉంది. ఒక్కోరోజైతే నాలుగైదుసార్లు కూడా కరెంటు సరఫరాలో అంతరాయం వస్తునే ఉంది. కరెంటు ఎందుకు పోయిందని అడిగితే చెట్టు కొమ్మలు పడిందని, మెయిల్ టెనెన్స్ అని మరోటని ఏదో కారణం చెబుతూనే ఉంటారు. ప్రతిరోజు చెట్టుకొమ్మలు పడుతునే ఉంటాయా ? ప్రతిరోజు మెయిన్ టెనెన్స్ ఏముంటుందో అధికారులే చెప్పాలి.

ఒక్కరోజు కూడా కరెంటు పోవటంలేదని కేసీయార్, కేటీయార్,హరీష్ రావులు గొప్పలు చెప్పుకోవచ్చు. బహుశా వాళ్ళకి కరెంటు పోవటంలేదేమో. వాళ్ళకి 24 గంటలూ కరెంటు ఉంటే జనాలందరి ఇళ్ళల్లోను కరెంటు ఉన్నట్లేనా ? కరెంటు పోవటంలేదని వాళ్ళు చెబుతున్నారంటే అదంతా అబద్ధమే అని అర్ధమైపోతోంది. ఇళ్ళకే సక్రమంగా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం ఇక రైతులకు ఏమిస్తోందో రైతులే చెప్పాలి. తమ దగ్గరే కరెంటు కోతలు పెట్టుకుని కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా చేయటంలేదని ఆరోపణలు చేయటం కేసీయార్, కేటీయార్ కే చెల్లింది.