Begin typing your search above and press return to search.

సోనియా మోసం చేసిందంటున్న కేటీఆర్... సంచలన వ్యాఖ్యలు!

గతంలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది టీఆరెస్స్ అనేవారు.. సహకరించింది బీజేపీ అని చెప్పేవారు. కాల క్రమంలో ఎవరి వెర్షన్ వారు వినిపించడం మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 9:36 AM GMT
సోనియా మోసం చేసిందంటున్న కేటీఆర్... సంచలన వ్యాఖ్యలు!
X

గతంలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది టీఆరెస్స్ అనేవారు.. సహకరించింది బీజేపీ అని చెప్పేవారు. కాల క్రమంలో ఎవరి వెర్షన్ వారు వినిపించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరాటం గురించి తనదైన విశ్లేషణ చేస్తున్నారు కేటీఆర్. తాజాగా హైదరాబాద్‌ లో నిర్వహించిన "మీట్‌ ది ప్రెస్‌" కార్యక్రమంలో స్పందించిన కేటీఆర్... సోనియా గాంధీపైనా, కాంగ్రెస్ పార్టీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యమధ్యలో మోడీపైనా ఫైరయ్యారు.

అవును... ఉన్న తెలంగాణను ఆనాడు ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని.. తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు అణచివేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు కేటీఆర్. ఇందులో భాగంగా... ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని, దీంతో వందల మంది బలిదానాలు చేసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడిందని తెలిపారు.

ఇక, కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని లెక్కచెప్పిన కేటీఆర్... తాము తొమ్మిదిన్నరేండ్లలో లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. మరో 90 వేల ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇదే సమయంలో జిల్లాకో మెడికల్ కాలేజ్ వచ్చిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే.. ఒక్క హైదరాబాద్‌ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు అభివృద్ధిపై విజన్‌ లేదని విమర్శించిన కేటీఆర్... మోడీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని.. పేదల ఖాతాలో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడపోయాయని నిలదీశారు. అదేవిధంగా... రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, దేశాన్ని ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ చేస్తామని చెప్పిన మాటలు, ఇచ్చిన హామీ ఎక్కడికి పోయాయని కేటీఆర్.. మోడీ సర్కార్ ని సూటిగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో... ఏపీలో ఎలాగూ కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని ఆరాట పడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్రం వచ్చినపప్టినుంచీ లెక్కేసుకుంటే... కాంగ్రెస్‌ కు ప్రజలు 55 ఏళ్లపాటు అవకాశం ఇచ్చారని, కేంద్రంలో బీజేపీకీ పదేళ్లు అవకాశం ఇచ్చారని, ఇలా వారికి ఏళ్ల తరబడి అవకాశం ఇచ్చినా చేసిన అభివృద్ధి ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు.

ఈ సందర్భంగా... మేడిగడ్డ బ్యారేజ్‌ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి పదేళ్లు పూర్తయ్యిందని, ప్రజలకు సంబంధించి ఒక్కపైసా వృథాకాదని, ప్రజలపై ఒక్కపైసా భారం పడకుండా ఏజెన్సీనే పూర్తి చేస్తుందని తెలిపారు. దీనిపై భిన్న కామెంట్లు వస్తున్నాయి.

కాగా... కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్‌ లో 20వ పియర్‌ కుంగుబాటు అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికల సమయంలో ఈ ఘటన జరగడంతో అధికార పార్టీ మెడకు ఉచ్చు బిగిస్తోందని అంటునారు. ఈ క్రమంలో... ఈ బ్యారేజ్ కుంగుబాటు ఘటనపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. ఆదివారంలోగా ఘటనపై తాము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది.