Begin typing your search above and press return to search.

కృప లేదా...టికెట్ రాదా...!?

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఆమె సీనియర్ నేత. రెండు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 3:45 AM GMT
కృప లేదా...టికెట్ రాదా...!?
X

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఆమె సీనియర్ నేత. రెండు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు. ఆమె కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. 2004లో ఆమె వైఎస్సార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ఆ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడుని ఎదుర్కొన్నారు. అయితే తొలిసారి ఆమె ఓటమి చెందారు. కానీ 2009లో మాత్రం ఆమె విజయం సాధించారు. ఎర్రన్నాయుడుని ఓడించి జెయింట్ కిల్లర్ అయ్యారు.

ఆ తరువాత ఆమె యూపీయే టూలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో ఆమె కాంగ్రెస్ లో ఉంటూ పోటీ చేసి ఓడారు. 2019 ఎన్నికల ముందు ఆమె వైసీపీలో చేరారు. అయితే అప్పట్లో ఆమెకు శ్రీకాకుళం ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం సాగినా దక్కలేదు. ఇక ఈ మధ్యలో రాజ్యసభ సీటు మీద ఆమె ఆశ పెంచుకున్నా ఆ పదవి కూడా అందలేదు.

ఇక 2024 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ లేదా శ్రీకాకుళం ఎంపీ సీటు ఇస్తారని ఆమె వర్గం ఆశతో ఉంది. కానీ తాజాగా రిలీజ్ చేసిన వైసీపీ మూడవ విడత జాబితాలో ఆమె పేరు లేదు. టెక్కలికి దువ్వాడ శ్రీనివాస్ ని ఇంచార్జి చేశారు. అంటే ఆయనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అన్న మాట.

అదే టెక్కలికి చెందిన కళింగ కార్పోరేషన్ చైర్మన్ అయిన పేరాడ తిలక్ కి శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అన్న మాట. దీంతో కిల్లి కృపారాణి రాజకీయ భవిష్యత్తు మీద అనుచర వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆమె టీడీపీలోకి వెళ్లాలనుకున్నా అక్కడ కూడా చాన్స్ లేదని అంటున్నారు.

ఎందుకంటే అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీ సీటుకు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. దాంతో కిల్లి రాజకీయం డోలాయమానంలో పడింది అని అంటున్నారు ఆమెకు ఇపుడు కాంగ్రెస్ ఒక్కటే ఆశాకిరణంగా కనిపించవచ్చు అని అంటున్నారు ఆ పార్టీలో వెళ్ళి ఉనికి చాటుకోవడం తప్ప గెలిచేది ఉండదు అన్నది వాస్తవం అంటున్నారు. దాంతో ఆమె వైసీపీ అధినాయకత్వం ఇచ్చే భవిష్యత్తు హామీల మీద నమ్మకం ఉంచి పార్టీ గెలుపు కోసం కృషి చేయడమే మిగిలి ఉంది అని అంటున్నారు. మరి ఆమె ఏమి చేస్తారు అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు.