Begin typing your search above and press return to search.

సిగ్గు సిగ్గు : అంత సెక్యూరిటీలో అమెరికా మంత్రి బ్యాగ్ చోరీ..

అమెరికా అంతర్గత భద్రతా విభాగానికి (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ) అధిపతి అయిన కార్యదర్శి క్రిస్టీ నియోమ్‌ వాషింగ్టన్ డీసీలోని ఒక రెస్టారెంట్‌లో ఉండగా ఆమె ఖరీదైన బ్యాగ్ చోరీకి గురైంది.

By:  Tupaki Desk   |   28 April 2025 3:00 AM IST
సిగ్గు సిగ్గు : అంత సెక్యూరిటీలో అమెరికా మంత్రి బ్యాగ్ చోరీ..
X

అమెరికా అంతర్గత భద్రతా విభాగానికి (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ) అధిపతి అయిన కార్యదర్శి క్రిస్టీ నియోమ్‌ వాషింగ్టన్ డీసీలోని ఒక రెస్టారెంట్‌లో ఉండగా ఆమె ఖరీదైన బ్యాగ్ చోరీకి గురైంది. దేశంలో అత్యున్నత భద్రతా సిబ్బంది అయిన సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది సమక్షంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. దాదాపు వారం రోజుల పాటు ముమ్మరంగా గాలించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ నెల ఏప్రిల్ 20న ఈస్టర్ సందర్భంగా క్రిస్టి నియోమ్‌ తన కుటుంబంతో కలిసి వైట్‌హౌస్‌కు సమీపంలో ఉన్న 'ది క్యాపిటల్‌ బర్గర్‌' రెస్టారెంట్‌కు వెళ్లారు. అదే సమయంలో ముదురు రంగు దుస్తులు, బేస్‌బాల్‌ క్యాప్‌, ముఖానికి మాస్క్‌ ధరించిన ఒక వ్యక్తి రెస్టారెంట్‌లోకి ప్రవేశించాడు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం, నియోమ్‌ కూర్చున్న టేబుల్‌కు సమీపంలోనే కూర్చుని ఆమె బ్యాగ్‌ను చాకచక్యంగా అపహరించాడు.

చోరీకి గురైన బ్యాగ్ ప్రముఖ గూచీ బ్రాండ్‌కు చెందినది కాగా, దాని విలువ సుమారు 4,400 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 3.76 లక్షలు). బ్యాగులో సుమారు 3,000 డాలర్ల (రూ. 2.56 లక్షలు) నగదుతో పాటు, నియోమ్‌ పాస్‌పోర్టు, డీహెచ్‌ఎస్ బ్యాడ్జ్‌, అపార్ట్‌మెంట్ తాళం చెవులు, కొన్ని రహస్య పత్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెస్టారెంట్‌లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ వ్యక్తి కదలికలను గుర్తించి, విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని లుయిగి మాంగియోన్‌గా గుర్తించినట్లు కొన్ని ఆంగ్ల వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఈ ఘటనపై క్రిస్టీ నియోమ్‌ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "నా బ్యాగ్‌ను నా కాలి పక్కనే పెట్టుకున్నాను. ఒక వ్యక్తి వచ్చి నా పక్కనే కూర్చుని, తన కాలితో బ్యాగ్‌ను కొన్ని అడుగుల దూరం లాగి, దానిపై తన కోట్ వేసి తీసుకెళ్లిపోయాడు. ఇది చాలా ప్రొఫెషనల్‌గా జరిగింది. ఇలాంటి ఘటనలు సామాన్య ప్రజలకు నిత్యం ఎదురవుతాయనే విషయం నాకు ఈ సంఘటనతో అర్థమైంది" అని ఆమె పేర్కొన్నారు. నిందితుడు ఒక ప్రొఫెషనల్ దొంగ అని ఆమె వెల్లడించారు.

అరెస్ట్ అయిన దొంగ ఈస్ట్‌కోస్ట్‌కు చెందిన ఒక గ్యాంగ్‌లో సభ్యుడని అధికారులు భావిస్తున్నారు. ఈ ముఠా అత్యంత విలువైన వస్తువులను చోరీ చేయడంలో ఆరితేరిందని తెలిపారు. ఈ దొంగతనం కేవలం అవకాశాన్ని బట్టి జరిగిందా లేక నియోమ్‌ను లక్ష్యంగా చేసుకుని చేశారా అనేది ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... హోమ్‌ల్యాండ్‌ సెక్రటరీ హోదాలో క్రిస్టీ నియోమ్‌కు సీక్రెట్‌ సర్వీస్ భద్రత ఉంటుంది. సాధారణ దుస్తుల్లో ఉండే ఈ సిబ్బంది నియోమ్‌తో పాటే రెస్టారెంట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వారి సమక్షంలోనే దొంగతనం జరగడం భద్రతా వైఫల్యంగా విమర్శలు వెలువడుతున్నాయి. ఈ ఘటనపై సీక్రెట్‌ సర్వీస్ కూడా విచారణ జరుపుతోంది. రెస్టారెంట్‌కు సమీపంలోనే కొద్ది రోజుల ముందు ఇదే తరహాలో మరో చోరీ జరిగినట్లు, ఈ రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు