Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్టు:గచ్చిబౌలి స్టేషన్ లో క్రిష్ తీరు ఎలా ఉంది?

అందుకు భిన్నంగా ఆయనే స్వయంగా స్టేషన్ కు వస్తున్నట్లుగా అరగంట ముందు సమాచారం ఇచ్చి.. తన స్నేహితులతో కలిసి స్టేషన్ కు వచ్చారు.

By:  Tupaki Desk   |   2 March 2024 4:51 AM GMT
గ్రౌండ్ రిపోర్టు:గచ్చిబౌలి స్టేషన్ లో క్రిష్ తీరు ఎలా ఉంది?
X

రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు ప్రముఖ దర్శకులు జాగర్లమూడి క్రిష్. సాధారణంగా తీవ్రమైన నేరారోపణలు చోటు చేసుకున్న సందర్భంలో వ్యవహరించే తీరుకు భిన్నంగా క్రిష్ వ్యవహారశైలి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాడిసన్ డ్రగ్స్ పార్టీకి హాజరైనట్లుగా ఈ పార్టీని నిర్వహించిన వివేకానంద పోలీసులకు చెప్పటంతో ఆయన పేరు ఈ వ్యవహారంలో చేరింది. ఆయన డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అన్నది మాత్రం స్ఫష్టం కాలేదు. పార్టీ నిర్వాహకుడు సైతం ఈ అంశంపై ఏం చెప్పారన్నది రిపోర్టు కాలేదు.

కట్ చేస్తే.. రాడిసన్ పార్టీకి హాజరైన క్రిష్.. ఆ తర్వాత హైదరాబాద్ లో లేకపోవటం..ఆయన్ను పోలీసులు కాంటాక్టు చేసినప్పుడు తాను ఊళ్లో లేనని.. రెండు రోజుల్లో వస్తానని చెప్పటం తెలిసిందే. కానీ.. అప్పటికి రాకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆయన హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. అదే రోజు సాయంత్రం గచ్చిబౌలి స్టేషన్ కు వచ్చారు.

వాస్తవానికి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వేళలో.. స్టేషన్ కు ఏ ప్రముఖుడు వెళ్లరు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే తీరును ప్రదర్శిస్తారు. అందుకు భిన్నంగా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించి.. అదే రోజు గచ్చిబౌలి స్టేషన్ కు వెళ్లటం ద్వారా.. క్రిష్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసినట్లుగా చెబుతున్నారు. పోలీసు వర్గాలు సైతం ఆయన తమ వద్దకు రారని భావించిన పరిస్థితి.

అందుకు భిన్నంగా ఆయనే స్వయంగా స్టేషన్ కు వస్తున్నట్లుగా అరగంట ముందు సమాచారం ఇచ్చి.. తన స్నేహితులతో కలిసి స్టేషన్ కు వచ్చారు. మీడియా కంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్న ఆయన.. నేరుగా డీసీపీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. ఆ టైంలో డీసీపీ అందుబాటులో లేరు. సదరు అధికారి వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పినప్పుడు.. అందుకు సరేనన్న క్రిష్.. అక్కడే ఉండిపోయారే తప్పించి.. మళ్లీ వస్తానని చెప్పలేదు.

తన స్నేహితుల్లో ఒకరితో కలిసి కూర్చున్న ఆయన.. పోలీసు అధికారి వద్దకు వెళ్లే అరగంట వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండటం గమనార్హం. తన ఫోన్ చూసుకుంటూ ఉండిపోయారే తప్పించి.. అసలేం మాట్లాడలేదని చెబుతున్నారు. డీసీపీ వచ్చిన తర్వాత ఆయన వద్ద నేరుగా వెళ్లిన ఆయన.. తనను అడిగిన అన్నిప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పటం గమనార్హం. అంతేకాదు.. పోలీసులు డ్రగ్ పరీక్షకు సిద్ధమా? అని అన్నంతనే ఏ పరీక్షకైనా సిద్ధమని పేర్కొనటం ద్వారా.. క్రిష్ తాను కోర్టులో చెప్పిన వాదనకు తగ్గట్లే ఆయన వ్యవహారశైలి ఉందన్న అభిప్రాయాన్ని కలిగించారు. మొత్తంగా తన తీరుతో ఆయనతో డీల్ చేసే పోలీసులు అధికారులకు ఒక నమ్మకం కలిగించినట్లుగా తెలుస్తోంది. తానో పెద్ద సెలబ్రిటీని అయినప్పటికీ అందుకు భిన్నంగా చాలా బాధ్యతగా వ్యవహరించారని పోలీసు వర్గాలు మాట్లాడుకోవటం కనిపించింది.