కొమ్మినేనికి వర్తించిన భావ ప్రకటన స్వేచ్ఛ.. కృష్ణంరాజుకు వర్తించదా?
రాజధాని అమరావతి మహిళల పట్ల అత్యంత జుగుస్పాకరమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజుకు బెయిలు లభించడం అంత ఈజీ కాదన్న చర్చ న్యాయవాద వర్గాల్లో జరుగుతోంది.
By: Tupaki Desk | 14 Jun 2025 5:22 AMరాజధాని అమరావతి మహిళల పట్ల అత్యంత జుగుస్పాకరమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజుకు బెయిలు లభించడం అంత ఈజీ కాదన్న చర్చ న్యాయవాద వర్గాల్లో జరుగుతోంది. ఇదే కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిలు తెచ్చుకున్న మరో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు దక్కిన న్యాయం కృష్ణంరాజుకు అందే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. దీనికి కారణం ఆ ఇద్దరి వ్యాఖ్యలు, ప్రవర్తనలో ఉన్న వ్యత్యాసమే అంటున్నారు. కొమ్మినేనికి బెయిల్ ఇచ్చే సందర్భంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే కృష్ణంరాజుకు బెయిల్ విషయంలో అవే వ్యాఖ్యలు అవరోధంగా నిలిచే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
కొమ్మినేని బెయిల్ దరఖాస్తు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కొమ్మినేని మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయలేదని అభిప్రాయపడిన న్యాయస్థానం ఆయన కేవలం ‘యాంకర్’ పాత్ర పోషించినట్లు వ్యాఖ్యానించింది. నవ్వినంత మాత్రాన నేరం కాదని, ఆ కారణంగా కొమ్మినేని అరెస్టు తగదని సుప్రీం తీర్పునిచ్చింది. ఈ క్రమంలో రాజ్యంగంలోని కీలకమైన భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 19, 19/2లను సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
భావ ప్రకటన స్వేచ్ఛను బందీ చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తీర్పులో వ్యాఖ్యానించడమే కాకుండా తాము కూడా తీర్పులు ఇచ్చే సమయంలో నవ్వుతామని వ్యాఖ్యానించింది. దీంతో కొమ్మినేని విషయంలో సుప్రీం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే కొమ్మినేని బెయిలు తీర్పు మరో నిందితుడు కృష్ణంరాజుకు వర్తించే అవకాశం లేదని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. కొమ్మినేనికి సుప్రీంలో ఊరట దక్కడంతో తాను కూడా బెయిలు కోసం అక్కడే తేల్చుకోవాలని నిందితుడు కృష్ణంరాజు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే కొమ్మినేని బెయిలుకు పరిగణించిన నిబంధనలు కృష్ణంరాజు విషయంలోనూ పరిగణలోకి తీసుకుంటారా? అన్నదే చర్చగా మారింది.
సుప్రీంకోర్టు పేర్కొన్న ఆర్టికల్ 19, 19/1, 19/2 ప్రకారం బావ ప్రకటన స్వేచ్ఛ లభిస్తున్నా, అదే ఆర్టికల్ లోని 19/4 బావ ప్రకటన స్వేచ్ఛను కొంత నియంత్రిస్తుందని చెబుతున్నారు. ఒక వర్గాన్ని సమాజాన్ని దూషించడం, నేరాలను అంటగట్టడం, భావ ప్రకటన కిందకు రాబోదని 19/4 ఆర్టికల్ చెబుతోందని అంటున్నారు. దీంతో బెయిలు కోసం కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కేలా కనిపించడం లేదంటున్నారు. కృష్ణంరాజు వ్యాఖ్యల తీవ్రత, ఒక సమూహాన్ని, కీలకమైన రాజధాని ప్రాంతాన్ని అవమానించేలా తప్పుపట్టేలా ఉన్నాయని కాబట్టి ఆయనకు ఎలాంటి ఊరట దక్కే పరిస్థితి లేదని అంటున్నారు.