కృష్ణలంక కేసులో అనూహ్య ట్విస్ట్.. పోలీసుస్టేషన్ వద్ద మహిళల ధర్నా
విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
By: Tupaki Political Desk | 21 Jun 2026 3:51 PM ISTవిజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ కొద్దిరోజులుగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా సాయికృష్ణ మిస్సింగ్ పై అతడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీఐపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా సీఐ నాగరాజును అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆదివారం అనూహ్యరీతిలో సీఐకి మద్దతుగా మహిళలు ఆందోళన నిర్వహించారు.
రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐని అరెస్టు చేస్తారనే ప్రచారంపై స్థానిక మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐకి మద్దతుగా ఆదివారం కృష్ణలంక పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. నిమ్మల జ్యోతిక నాయుడు అనే మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో పలువురు మహిళలు, యువకులు సీఐకి మద్దతుగా నినాదాలు చేశారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు శాంతిభద్రతలను కాపాడుతున్నారంటూ కితాబునిచ్చారు. దీంతో మహిళల ఆందోళన కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారంతో సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ మరో టర్న్ తీసుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు సీఐ నాగరాజుపై బాధితులు, విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వారి విమర్శల దాడితో ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలోకి వెళ్లినట్లు కనిపించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ మిస్సింగును ఓ కులానికి కూడా ముడిపెట్టే ప్రయత్నాలు జరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నలుగురు ఐపీఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి మిస్టరీని ఛేదించాలని నిర్ణయించింది.
ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక మహిళలు అనూహ్యంగా రంగంలోకి దిగారు. గంజాయి, బ్లేడ్ బ్యాచులను ఉక్కుపాదంతో అణచివేస్తున్న సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవడం కరెక్టు కాదని చెబుతున్నారు. అయితే గత రెండు వారాలుగా ఈ వివాదం తీవ్ర దుమారం రేపుతుండగా, ప్రభుత్వం సీరియస్ గా చర్యలకు సిద్ధమైన తర్వాత స్థానికులు రంగంలోకి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఐకి మద్దతుగా ఆందోళన చేసిన మహిళలు స్వచ్ఛందంగా ఆ నిర్ణయం తీసుకున్నారా? లేక వేరొరి ప్రోద్బలంతో ధర్నాకు వచ్చారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఐకి మద్దతుగా స్థానికులు రోడ్డెక్కడం ఈ కేసును మలుపు తిప్పడమే అంటున్నారు. ఈ ఆందోళన విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ఆసక్తి రేపుతోందని అంటున్నారు.
