ఉమ్మడి కృష్ణాలో 'సంచులు' సరిపోవట్లేదట..!
ఉమ్మడి కృష్ణా జిల్లా అంటేనే.. ఇసుక, మద్యం, మట్టికి ప్రాధాన్యం ఉంటుంది. ఏ నాయకుడు అయినా.. ఈ మూడు అంశాలను పక్కన పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి లేదు.
By: Tupaki Desk | 19 May 2025 6:00 PM ISTఉమ్మడి కృష్ణాజిల్లా గురించి ప్రధాన పత్రికల్లో వరుస పెట్టి వస్తున్న కథనాలు.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నాయి. ఆ వార్తలు కూడా.. జిల్లా ఎడిషన్లలోనో.. జోన్ విభాగాల్లోనో కాకుండా.. ఏకంగా.. ప్రధాన ఎడిషన్ల లోనే పతాక శీర్షికల్లోనే వార్తలు వస్తున్నాయి. దీంతో కూటమి పార్టీల మధ్య ఈ విషయం చర్చగా మారింది. సంచులు సర్దేస్తున్నారని.. సంచులు సరిపోవట్లేదని.. పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నిజానికి గతంలో నూ ఇలానే ఉన్నా.. ఇప్పుడు మరింతగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది.
ఏం జరుగుతోంది?
ఉమ్మడి కృష్ణా జిల్లా అంటేనే.. ఇసుక, మద్యం, మట్టికి ప్రాధాన్యం ఉంటుంది. ఏ నాయకుడు అయినా.. ఈ మూడు అంశాలను పక్కన పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఇది వైసీపీ అయినా.. టీడీపీ అయినా.. మరో పార్టీ అయినా.. నాయకులు నాయకులే కదా!. పైగా చెంతనే గలగలా పారే కృష్ణమ్మ ఉండడం.. కొండలకుకొదవ లేకపోవడం.. మందుబాబులు సైతం ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో ఈ జిల్లా ఈ మూడు అంశాల్లో పేరెన్నికగందనే చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కృష్ణాలో ఏ నాయకుడైనా.. బలంగా ఎదిగారంటే.. వారి వెనుక.. ఈ మూడింటిలో ఏదో ఒకటి కామన్‌గా ఉంటుంది. ఇది గతం మాట. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. వచ్చే ఎన్నికలను ముందుగానే ఊహించుకుంటున్న నాయకులు.. సొంత కూటమిలోనే పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి పార్టీల్లో డబుల్-త్రిబుల్ నాయకులు ఉన్నారు.
అంటే.. ఒక్కొక్క నియోజకవర్గానికి బలమైన నాయకులు ఇద్దరేసి చొప్పున ఉన్నారు. అయితే.. గత ఎన్నిక ల్లో టికెట్లు త్యాగాలు చేశారు. కానీ, త్యాగ ధనులు ఇప్పుడు బలోపేతం అవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తమ గుర్రం ఎగిరితే.. అప్పటికి తమ దగ్గర సొమ్ములు లేకపోతే.. ఎలా అంటూ.. చెలరేగుతున్నారు. దీనిని చూసి.. అసలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న వారు.. వీరిని మించిన రీతిలో సంపాదనకు పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నారు. దీంతో పోటా పోటీగా ఇసుక, మద్యం, మట్టి అక్రమాలు సాగుతున్నా యి. మరి ఇది మంచి చేస్తుందా? చెడు తెస్తుందా? అనేది వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.
