Begin typing your search above and press return to search.

పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!... సింబల్ తెలిస్తే షాకే!

కే. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి గాజు గ్లాసుని పోలిన బకెట్ గుర్తుపై పిఠాపురంలో పోటీ అనే అంశం ఇప్పుడు జనసైనికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు!

By:  Tupaki Desk   |   10 April 2024 10:24 AM GMT
పిఠాపురం నుంచి కే.పవన్  కల్యాణ్  పోటీ!... సింబల్  తెలిస్తే షాకే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు సరికొత్త చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి! ఇప్పటికే జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసిందనే వార్తలు అల్లకల్లొలంగా మారిన సంగతి తెలిసిందే! జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల కూటమికి ఇది చాలా పెద్ద ఇబ్బంది అని చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా జనసేనానికి మరో చిక్కొచ్చి పడేలా ఉందని తెలుస్తుంది!

అవును... రానున్న ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో కాకుండా పిఠాపురంలోనే తాను పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో... పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలుస్తారని జనసైనికులు చెబుతున్నారు. మరోపక్క ఈసారి కూడా పవన్ ని ఓడించాలని అధికార పార్టీ కంకణం కట్టుకుందని అంటున్నారు. మరోపక్క... పవన్ ని వైసీపీ వాళ్లు కాదు.. టీడీపీ వాళ్లే ఓడిస్తారని, ఇదో రకం స్కెచ్ అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ సంగతులు అలా ఉంటే... తాజాగా పిఠాపురంలో తన అభ్యర్థిని నిలబెట్టనుందంట నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ పిఠాపురం అభ్యర్థి పేరు కే. పవన్ కల్యాణ్ కాగా... వారి ఎన్నికల గుర్తు బకెట్! దీంతో... ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. కే. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి గాజు గ్లాసుని పోలిన బకెట్ గుర్తుపై పిఠాపురంలో పోటీ అనే అంశం ఇప్పుడు జనసైనికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు!

కాగా... ఈ సమస్య కేవలం పిఠాపురానికే పరిమితం కాదని తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో బకెట్ సింబల్ ఉన్న తమను పోటీ చేయొద్దని పవన్ కల్యాణ్ బెదిరించారని, ప్రలోభ పెట్టారని నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, ఎంపీ బాలశౌరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు షేక్ జలీల్ తెలిపారు.

ఇదే సమయంలో... మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తనను ఏకంగా తుపాకీతో బెదిరించాడని షేక్ జలీల్ ఆరోపించారు. గాజు గ్లాస్, బకెట్ గుర్తు చూడటానికి ఒకేలా ఉంటున్నాయనే ఉద్దేశంతో తమను పోటీ చేయవద్దని జనసేన నేతలు బెదిరింపులకు దిగుతున్నారని జలీల్ చెప్పారు. ఇదే క్రమంలో.. ఐదు కోట్లు ఇస్తామని కూడా ఆశ చూపారన్న జలీల్.. తాను అందుకు ఒప్పుకోలేదని చెప్పిన సంగతీ తెలిసిందే!