Begin typing your search above and press return to search.

దరిద్రపుగొట్టు సంప్రదాయం: నేపాల్ మాజీ ప్రధాని అరెస్టు

ఒక దేశ అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి సంబంధించిన అంశాలపై ఆచితూచి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి.

By:  Tupaki Desk   |   28 March 2026 10:04 AM IST
దరిద్రపుగొట్టు సంప్రదాయం: నేపాల్ మాజీ ప్రధాని అరెస్టు
X

ఒక దేశ అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి సంబంధించిన అంశాలపై ఆచితూచి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తప్పనిసరి అని భావిస్తే.. న్యాయసమ్మతంగా.. అందరూ ఆమోదించే రీతిలో చట్టపరమైన చర్యలు చాలా అవసరం. అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణి ఏ మాత్రం సరికాదు. ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల్లో సరికొత్త ధోరణి మొదలైంది. అధికారంలోకి వచ్చినంతనే.. గత పాలకుల విషయంలో కఠినంగా వ్యవహరించే ధోరణి పెరిగింది. ఇందుకుతాజా నిదర్శనంగా నేపాల్ నిలిచింది. ఆ దేశ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తాజాగా అరెస్టు అయ్యారు.

షాకింగ్ అంశం ఏమంటే.. నేపాల్ కొత్త ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజునే మాజీ ప్రధాని అరెస్టుకావటం గమనార్హం. ఇంతకూ మాజీ ప్రధానమంత్రిని ఎందుకు అరెస్టు చేశారు? అన్న అంశంలోకి వెళితే.. గత ఏడాది సెప్టెంబరులో నేపాల్ లో జరిగిన జెన్ జీ నిరసనలను హింసాత్మకంగా అణిచివేసిన ఉదంతంపై ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఉదంతంపై వచ్చిన ఆరోపణలతో పాటు.. నిరసనల వేళ దాదాపు 76 మంది మరణించారని.. దీనికి ఓలి ప్రభుత్వ నిర్లక్ష్యంగా దర్యాప్తు కమిటీ తేల్చినట్లుగా చెబుతున్నారు.

మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మాత్రమే కాదు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ ను కూడా నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ లో పెరిగిన అవినీతికి వ్యతిరేకంగా గత సెప్టెంబరులో భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థులు, యువత ఈ ఆందోళనల్ని చేపట్టారు. నిరసనల తీవ్రత పెరగటం.. వాటిని బలంగా అణిచివేయాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో.. తన ప్రధానమంత్రి పదవికి ఓలి రాజీనామా చేశారు. కొత్త ప్రధాని అధికారంలోకి వచ్చిన రోజు వ్యవధిలో మాజీ ప్రధానిని అరెస్టు చేయటంతో ఇప్పుడేం జరుగుతుందన్నది చర్చగా మారింది.

వీరిపై పెట్టిన కేసుల తీవ్రత చూస్తే.. ఈ ఆరోపణలు నిజమని తేలితే గరిష్ఠంగా పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అరెస్టుల అనంతరం తాజా హోం మంత్రి సుదన్ గురుంగ్ మాట్లాడుతూ.. చట్టానికి ఎవరూ అతీతం కాదని పేర్కొనటం గమనార్హం. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు అరెస్టు కావటం నేపాల్ కు కొత్త కాకున్నా.. ఇప్పటివరకు జరిగిన అరెస్టు మొత్తం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో హౌస్ అరెస్టు లేదంటే అరెస్టు అయ్యారు. ఈసారి ఇందుకు భిన్నంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలించిన ఒక మాజీ ప్రధానిని అరెస్టు చేయటం.. ‘కల్పబుల్ హోమిసైడ్’ (దోషపూరిత నరహత్య) ఆరోపణలు నమోదు చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

ఈ ఉదంతాన్ని రెండు కోణాల్లో చూడాల్సిన పరిస్థితి. ఒక కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే గత పాలకుల్ని అరెస్టు చేయటం ద్వారా రాజకీయ కక్ష సాధింపు చర్యగా మారుతుంది. అదే సమయంలో.. తాజా అరెస్టు గత పాలకుల తప్పుల్ని తాజా ప్రభుత్వం తేలిగ్గా తీసుకోదని.. తగిన మూల్యం చెల్లించేలా చట్టపరమైన చర్యలు చేపట్టనున్న సంకేతాన్ని ఇస్తుందని చెప్పాలి.

ఇందుకు భిన్నంగా.. ఈ ప్రక్రియ మొత్తం అధికారం చేపట్టిన రోజులో కంటే కూడా.. ప్రజాస్వామ్య పద్దతిలో ఒక వరుస క్రమంలో విచారణ జరిపి.. కోర్టు ఆదేశాలతో ఈ తరహా చర్యలు చేపడితే ఒక మంచి సంప్రదాయంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే తీరు కొనసాగితే.. రానున్న రోజుల్లో పాలకులు ఎవరైనా గత పాలకులపై ముద్రలు వేసి చర్యలు తీసుకోవటం జరుగుతుందని.. అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థకు కొత్త ముప్పుగా మారుతుందన్న వాదన వినిపిస్తోంది.