Begin typing your search above and press return to search.

ప్రశాంతి రెడ్డిని ఓడించడం అంటే ఆషామాషీ కాదా ?

ఇక 1989 నాటికి కాంగ్రెస్ లో చేరిన నల్లపురెడ్డి అక్కడ నుంచి మరోసారి గెలిచారు. ఆయన మరణానంతరం ప్రసన్నకుమార్ రెడ్డి 1994లో టీడీపీ నుంచి మొదటిసారి గెలిచారు.

By:  Satya P   |   16 Jun 2026 9:19 AM IST
ప్రశాంతి రెడ్డిని ఓడించడం అంటే ఆషామాషీ కాదా ?
X

నల్లపురెడ్డి వారి కోటగా నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం పేరు పొందింది. తండ్రి సీనియర్ నేత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మూడు సార్లు గెలిస్తే కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి అయిదు సార్లు గెలిచిన సీటు అది. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ సీటు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అంతకు ముందు ఆయన కాంగ్రెస్ లో ఉండేవారు. 1985లో రెండోసారి కూడా గెలిచారు. ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఇక 1989 నాటికి కాంగ్రెస్ లో చేరిన నల్లపురెడ్డి అక్కడ నుంచి మరోసారి గెలిచారు. ఆయన మరణానంతరం ప్రసన్నకుమార్ రెడ్డి 1994లో టీడీపీ నుంచి మొదటిసారి గెలిచారు.

మంత్రిగా కూడా :

ఇక ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్టీఆర్ మంత్రివర్గంలో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1999, 2009లలో టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2012లో వైసీపీ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2019లో మరోసారి గెలిచారు. ఇలా నల్లపురెడ్డి కుటుంబానికి అనేక సార్లు కోవూరు జై కొట్టింది. అలాంటి సీటులో 2024 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తొలిసారి పోటీ చేసి ఏకంగా 54 వేల ఓట్ల భారీ తేడాతో ప్రసన్నకుమార్ రెడ్డిని ఓడించారు. దాంతో గడచిన రెండేళ్ళుగా ప్రశాంతి రెడ్డి తన హవాను గట్టిగా చాటుకుంటూ నల్లపురెడ్డి కోటలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నారు.

దూసుకుపోతున్నారు :

సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటూ వస్తున్న ప్రశాంతి రెడ్డి జనం వద్దకు వెళ్తున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రతీ రోజూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు అన్న పేరు తెచ్చుకున్నారు. పైగా కోవూరు నియోజకవర్గం హిస్టరీలో తొలిసారి గెలిచిన మహిళ కావడంతో ఆమెను జనాలు కూడా బాగానే ఆదరిస్తున్నారు. ఇక ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో ప్రశాంతి రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. అవి వ్యక్తిగత స్థాయిని దాటాయని కూడా టీడీపీ మండిపడింది. దాంతో ఆయన మీద పోలీసు కేసు దాకా వ్యవహారం వెళ్ళింది. ఆ విధంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్న ప్రసన్నకుమార్ రెడ్డి తాజాగా జరిగిన కూటమి వెన్నుపోటుకు రెండేళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోసారి ఆయన ప్రశాంతి రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో రాజకీయ రచ్చ గట్టిగానే రాజుకుంది.

మళ్ళీ ఓడిస్తా :

ఈ నేపధ్యంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అయితె నల్లపురెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎపుడో ఒకసారి కనిపించి మాయం అయ్యే వారిని ఎవరూ ఆదరించరని ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు 2029 ఎన్నికల్లో కూడా ప్రసన్నకుమార్ రెడ్డి ఓటమి ఖాయమని ముందే జోస్యం చెప్పేశారు. తాను ప్రజల మధ్యన ఉంటున్నాను అని అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తున్నాను అని ఆమె చెబుతున్నారు.

కష్టమే సుమా :

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఒక పధకం ప్రకారం కోవూరులో చొచ్చుకుని పోతున్నారు. అటు పార్టీ పరంగానే కాకుండా ఇటు తమ ఫౌండేషన్ ద్వారా కూడా ఆమె జనాలకు చేరువ అవుతున్నారు. ఆమె పనితీరు పట్ల టీడీపీ హైకమాండ్ కూడా సంతృప్తి చెందుతోంది. అదే సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రశాంతి రెడ్డిని ఓడించాలంటే అంత సులువైనది కాదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రత్యేకించి మహిళ కావడం వల్ల పరుష విమర్శలు చేస్తే తిప్పి కొడుతున్నాయి. ఇక జనంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దగా ఉండరన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీటిని దాటుకుని గెలవాలంటే చాలానే కృషి చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ రాజకీయ వ్యూహం రచిస్తారో చూడాల్సిందే అని అంటున్నారు.