పోలీసు విచారణకు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.. ఏం జరిగిందంటే..?
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని శుక్రవారం పోలీసులు విచారించారు.
By: Tupaki Desk | 25 July 2025 4:45 PM ISTకోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని శుక్రవారం పోలీసులు విచారించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అవమానించేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిలు తెచ్చుకున్న ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు సుమారు 3 గంటల పాటు విచారించారు. దాదాపు 40 ప్రశ్నలు అడిగిన పోలీసులు ప్రసన్నకుమార్ రెడ్డి నుంచి లిఖితపూర్వకంగా సమాధానాలు స్వీకరించారు.
కొద్దిరోజుల క్రితం కోవూరులోని వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై దారుణ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలకు దిగారు. దీంతో మరింత ఆగ్రహం చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యేపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఆయన వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు ప్రసన్నకుమార్ రెడ్డి అరెస్టుకు ప్రయత్నించారు. అయితే తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షించాలని నిందితుడు ప్రసన్నకుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిందితుడిపై ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులు నమోదు అవడంతో నోటీసు ఇచ్చి విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు సూచన మేరకు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు విచారించారు. అయితే తనపై ఫిర్యాదు చేయడాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితే జైళ్లు, కోర్టులు సరిపోవంటూ వ్యాఖ్యానించారు.
