Begin typing your search above and press return to search.

సూర్య ప్రకాశం ఏది పెద్దాయనా ?

ఆయన పేరులోనే వెలుగు ఉంది, ప్రత్యక్ష నారాయణుడు ఉన్నారు. ఆయనది రాజకీయ కుటుంబం. చరిత్ర చూస్తే ఏడు పదులకు పైనే ఉంది. ఆయనే కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి.

By:  Tupaki Desk   |   14 May 2025 3:37 AM
సూర్య ప్రకాశం ఏది పెద్దాయనా ?
X

ఆయన పేరులోనే వెలుగు ఉంది, ప్రత్యక్ష నారాయణుడు ఉన్నారు. ఆయనది రాజకీయ కుటుంబం. చరిత్ర చూస్తే ఏడు పదులకు పైనే ఉంది. ఆయనే కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి. ఆయన ఏపీకి రెండు సార్లు ముఖ్యమంత్రిగా అలాగే కేంద్రంలో మంత్రిగా ఇంకా అనేక కీలక పదవులు చేపట్టిన దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు, రాజకీయ వారసుడు. కోట్ల కుటుంబానిది ఏపీ రాజకీయాల్లో 1950 దశకం నుంచి ఉన్న చరిత్ర.

ఇక కోట్ల సూర్యప్రకాశరెడ్డిది మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర.. నేదురుమల్లి జనార్ధనరెడ్డిని కాంగ్రెస్ సీఎం గా తప్పించిన మీదట ఆయన ప్లేస్ లో విజయభాస్కరరెడ్డిని నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధాని అయిన పీవీ నరసింహారావు స్వయంగా ఎంపిక చేసి మరీ పంపించారు.

అలా కేంద్ర మంత్రిగా ఉన్న కోట్ల ఏపీకి సీఎం అయితే ఆయన ఖాళీ చేసిన కర్నూల్ ఎంపీ సీటుకు 1991లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచిన వారే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో అనేక సార్లు ఎంపీగా కర్నూల్ నుంచి గెలిచారు. యూపీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

ఇక ఏపీలో కాంగ్రెస్ పతనం అయిన తరువాత ఆయన టీడీపీని ఎంచుకున్నారు. నిజానికి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి టీడీపీలో ఉన్న కేఈ క్రిష్ణమూర్తి కుటుంబానికి రాజకీయంగా వైరం ఉంది. అయినా సరే మరో దారి లేక ఆయన టీడీపీ వైపు వచ్చారు. వచ్చారన్న మాటే కానీ ఆయనకు ఏదీ అనుకున్నట్లుగా జరగడం లేదు అని అంటున్నారు.

ఇక 2014లో కాంగ్రెస్ ఏపీలో పెద్దగా లేకపోయినా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన సూర్యప్రకాష్ రెడ్డికి లక్షా పదహరు వేల దాకా ఓట్లు వచ్చాయీ అంటే కోట్ల కుటుంబానికి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న పట్టు ఏమిటో తెలుసుతుంది అని అంటున్నారు. అయితే 2019లో కోట్లకు టీడీపీ కర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చినా ఆయన ఓటమి పాలు కావడంతో 2024లో మాత్రం నాగరాజు అనే కొత్త నాయకుడికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది.

నిజానికి ఎంపీ టికెట్ ని కోట్ల 2024 లో అడిగారు. ఈసారి పోటీ చేసి గెలిస్తే మళ్ళీ కేంద్ర మంత్రి కావచ్చు అన్నది ఆయన ఆశ. పైగా ఆయన ఎపుడూ పార్లమెంట్ కే వెళ్ళాలని కోరికగా ఉండేది. కానీ ఆయన చేత తొలిసారి డోన్ నుంచి పోటీ చేయించింది టీడీపీ హైకమాండ్. అలా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచిన కోట్ల తనకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావించారు.

ఎందుకంటే సీనియర్ నేతగా ఉండడంతో పాటు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి తన హోదాకు తగిన గౌరవం అనుకున్నారు. కానీ కర్నూల్ నుంచి టీజీ భరత్ తో పాటు బీ జనార్ధనరెడ్డిలకు మంత్రి పదవులు ఇస్తూ కొత్త వారికే చాన్స్ ని టీడీపీ ఇచ్చింది. దాంతో నీరసపడిన కోట్ల వర్గం ఇపుడు సైలెంట్ గా ఉంది.

పెద్దాయన సూర్యప్రకాష్ రెడ్డి అయితే తన నియోజకవర్గంలో అపుడపుడు పర్యటిస్తూ జనంతో మమేకం అవుతున్నారు. ఒకనాడు మొత్తం జిల్లాను శాసించిన పెద్దాయన కుటుంబం ఇపుడు ఇలా అయిందేంటి అని అనుచరులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట. విస్తరణలో సైతం ఆయనకు మంత్రి అవకాశాలు తక్కువే అని అంటున్నారు.

ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తే సొంత పార్టీలో ప్రత్యర్ధి బీసీ కుటుంబం అయిన కేఈ క్రిష్ణమూర్తి వారసులకు కూడా ఇవ్వాలి, దాంతో ఎందుకొచిన తలనొప్పి అని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఏడు పదుల వయసులో ఉన్న పెద్దాయనకు వర్తమాన రాజకీయం ఏమీ పాలుపోవడం లేదుట. కాంగ్రెస్ లో తనతో పాటు సతీమణిని ఎమ్మెల్యేగా చేసుకుని కుమారుడి రాజకీయ వారసత్వం కోసం బలంగా తయారు చేసుకున్నారు. తాను కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇపుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు అని ఈ దెబ్బతో కోట్ల రాజకీయం ఏమవుతుందో అని ఆయన వర్గం ఆలోచిస్తోందిట.