Begin typing your search above and press return to search.

కోట్ల టచ్ మీ నాట్...పెద్దాయనకు ఏమైంది ?

అలా వట్టి ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చిందని పెద్దాయన బాధపడుతున్నారు దాంతో ఏడాది కాలంగా ఆయన టీడీపీ అధినాయకత్వానికి టచ్ మీ నాట్ అంటూ దూరంగానే ఉంటూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 July 2025 9:14 AM IST
కోట్ల టచ్ మీ నాట్...పెద్దాయనకు ఏమైంది ?
X

కర్నూలు జిల్లా అంటే కోట్ల వారి కుటుంబమే రాజకీయంగా వినిపించే పేరు. ఇవాళ నిన్నా కాదు, 1950 నుంచి రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ అది. కేంద్ర మంత్రిగా ఉమ్మడి ఏపీకి రెండు సార్లు సీఎంగా పనిచేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి రాజకీయం 1950 దశకం నుంచే మొదలైంది. ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 1990 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. ఆయన మూడు సార్లు ఎంపీ, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉన్న కోట్ల వారికి ఇపుడు రాజకీయంగా అంతగా కలిసి రావడం లేదు అని అంటున్నారు. ఆయన తొలిసారి 2024లో డోన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తనకు కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వమని ఆయన కోరినా చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ నే ఇచ్చారు అన్నది ఒక బాధగా ఉంది. ఇక ఎమ్మెల్యే అయితే రాష్ట్ర మంత్రి కావచ్చు అన్న ఆశలు కూడా ఏ మాత్రం తీరలేదు.

అలా వట్టి ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చిందని పెద్దాయన బాధపడుతున్నారు దాంతో ఏడాది కాలంగా ఆయన టీడీపీ అధినాయకత్వానికి టచ్ మీ నాట్ అంటూ దూరంగానే ఉంటూ వస్తున్నారు. కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలోనే ఆయన పనులు చూసుకుంటున్నారు అది తప్పించి వేరే విధంగా అయితే టీడీపీ పెద్దలకు టచ్ లో లేరు అని అంటున్నారు

ఇక డోన్ లో ధర్మవరం సుబ్బారెడ్డి అనే మరో నేతను అధినాయకత్వం కావాలని ప్రోత్సహిస్తోంది అన్న ఆవేదన కూడా ఆయనకు ఉందని అంటున్నారు. ఆయనకు సీడ్ కార్పోరేషన్ చైర్మన్ పేరుతో కీలక పదవిని ఇచ్చారు. దాంతో ఆయన ఎమ్మెల్యేను సైతం లెక్క చేయకుండా తన హవా చూపిస్తున్నారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలలో ఎక్కడా ఎమ్మెల్యే ప్రస్తావన కానీ ఆయన ఫోటో కానీ లేకుండానే తానే అంతా అయి ముందుకు సాగుతూండడం కోట్ల వర్గానికి మండిస్తోంది అని అంటున్నారు.

ఈ విషయంలో కూడా తీవ్ర ఆగ్రహం మీద ఉన్న పెద్దాయన అయితే హైకమాండ్ పెద్దలను గత ఏడాదిగా కలిసే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నారు. మరో వైపు చూస్తే పక్కనే కడపలో మహనాడుని టీడీపీ ఘనంగా నిర్వహిస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హాజరు కాలేదు. అంతే కాదు ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కూడా గైర్ హాజరు అయ్యారు.

ఇక చంద్రబాబు ఇటీవల నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సైతం ఆయన డుమ్మా కొట్టారు. బాబు మీటింగుకు హాజరు కానీ 15 మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరుగా ఉన్నారు. ఇలా కోట్ల టీడీపీ పెద్దలకు దూరం పాటిస్తున్నారు. ఇదంతా కోపమా అసహనమా లేక తీరని అసంతృప్తా అన్నది అయితే ఎవరికీ అర్థం కావడం లేదుట.

మరో వైపు చూస్తే టీడీపీ పెద్దలు కూడా ఆయన గురించి పెద్దగా ఆలోచించడం లేదు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ధర్మవరం సుబ్బారెడ్డి తన ప్రయత్నాల్లో ఉన్నారు కోట్ల కూడా వయోభారంతో వచ్చేసారి పోటీకి దిగరని అంటున్నారు. తన కుమారుడికి టికెట్ ఇచ్చే పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు అని అంటున్నారు. మొత్తానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయం ఈసారి చాలా విభిన్నంగా సాగుతోంది. టీడీపీలోకి చేరిన ఆయనకు ప్రాంతీయ పార్టీ రాజకీయాలు ఏ మాత్రం ఒంటబట్టడం లేదు అని అంటున్నారు. చూడాలి మరి పెద్దాయన ముందు ముందు ఏ విధంగా తన రాజకీయాన్ని మలుపు తిప్పుతారో.