టీడీపీ కేడర్ హీరో కోటంరెడ్డి.. మహానాడు ప్రసంగంతో ఒక్కసారి హైప్!
లక్షల మంది కార్యకర్తలు ఒక ఎమ్మెల్యే ప్రసంగానికి అంతలా ఆకర్షణకు గురికావడానికి కోటంరెడ్డి లేవనెత్తిన పాయింట్ వారిని కట్టిపడేసిందని చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 30 May 2026 3:12 PM ISTటీడీపీ సోషల్ మీడియా పేజీల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడు వేదికపై ఆయన ప్రసంగించిన తీరు కేడర్ ను విపరీతంగా ఆకట్టుకుందని చెబుతున్నారు. తమ మనసు గెలుచుకున్న నేతగా శ్రీధర్ రెడ్డి ప్రసంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా కేడర్ వైరల్ చేస్తున్నారు. లక్షల మంది కార్యకర్తలు ఒక ఎమ్మెల్యే ప్రసంగానికి అంతలా ఆకర్షణకు గురికావడానికి కోటంరెడ్డి లేవనెత్తిన పాయింట్ వారిని కట్టిపడేసిందని చెబుతున్నారు.
మహానాడు వేదికపై ప్రసంగించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీ కేడర్ పోటీపై అధిష్టానానికి కీలక సూచనలు చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో తొలి నుంచి టీడీపీలో ఉన్న వారికే టికెట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అరెస్టులకు భయపడకుండా పోరాడిన నాయకులు, కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని కోటంరెడ్డి అధిష్టానాన్ని కోరారు. పార్టీ అన్న తర్వాత నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ ఎప్పుడు పార్టీ కోసం పనిచేసేవారు కార్యకర్తలు మాత్రమే. అటువంటి వారికి క్షేత్రస్థాయిలో గుర్తింపు దక్కాలంటే స్థానిక ఎన్నికల్లో వంద శాతం టికెట్లు వారికే ఇవ్వాలంటూ కోటంరెడ్డి స్పష్టం చేశారు.
అంతేకాకుండా తన నియోజకవర్గంలో వంద శాతం టికెట్లను ఓల్డ్ టీడీపీ కార్యకర్తలకే ఇస్తానంటూ ప్రకటించారు. మహానాడు వేదికపై నుంచి కార్యకర్తల మనసు గెలుచుకునేలా కోటంరెడ్డి మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోటంరెడ్డి మాట్లాడిన తీరుతో కేడర్ మొత్తం ఫిదా అయిందని అంటున్నారు. తమ మనసులో ఉన్న మాటను కోటంరెడ్డి చెప్పారంటూ ఆయన వీడియోను వైరల్ చేస్తున్నారు. మహానాడు ముగిసినా కోటంరెడ్డి వీడియో టీడీపీ కేడర్ వాట్సాప్ స్టేటస్ గా దర్శనమిస్తోందని చెబుతున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు కోటంరెడ్డి టీడీపీలో చేరారు. అప్పటివరకు టీడీపీకి వ్యతిరేకంగానే రాజకీయం చేసిన కోటంరెడ్డి నాటి పరిస్థితుల వల్ల టీడీపీలో చేరాల్సివచ్చిందని చెబుతున్నారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచారు. ఈ విషయాన్ని తన ప్రసంగంలో చెప్పిన కోటంరెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకులు పార్టీలోకి వచ్చిపోతుంటారని కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారని చెప్పడం అందరినీ కనెక్ట్ చేసిందని అంటున్నారు.
