Begin typing your search above and press return to search.

అయ్యో కూన‌: చిన్న పొర‌పాటు.. పెద్ద గండం.. !

ఒక చిన్న పొరపాటు రాజకీయ నాయకులకు పెద్ద తిప్పలే తీసుకొస్తుంది. అవి అనూహ్యంగా జరిగినా, కావాలని చేసిన పొరపాట్లు మాత్రం గ్రహపాట్లుగా మారతాయి.

By:  Garuda Media   |   29 Aug 2025 10:00 AM IST
అయ్యో కూన‌: చిన్న పొర‌పాటు.. పెద్ద గండం.. !
X

ఒక చిన్న పొరపాటు రాజకీయ నాయకులకు పెద్ద తిప్పలే తీసుకొస్తుంది. అవి అనూహ్యంగా జరిగినా, కావాలని చేసిన పొరపాట్లు మాత్రం గ్రహపాట్లుగా మారతాయి. ఇది గతంలోను జరిగింది. ఇప్పుడు జరుగుతోంది. ప్రధానంగా టిడిపిలో చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. నేరుగా చంద్రబాబు ఎవరినీ శిక్షించరు. ఎవరినీ దండించరు. కానీ, ఆయన ఇవ్వాలనుకున్న పదవులు మాత్రం తొక్కిపెట్టేస్తారు. ఉదాహరణకు 2014 -19 మధ్య వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన ఓ మైనారిటీ ఎమ్మెల్యే కి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించాలని భావించారు.

అలాగే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు కూడా పార్టీలోకి వచ్చాక గిరిజన సంక్షేమ శాఖను అప్పగించాలని, మంత్రిని చేయాలని చంద్రబాబు లెక్కలు వేసుకున్నారు. కానీ, చిత్రంగా ఆ ఇద్దరు నాయకులు కూడా అత్యుత్సాహానికి పోయి మీడియా ముందు వివాదాలకు దారితీసేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో వారు ఆశించిన పదవులు రాకపోగా పార్టీలోనూ వారికి పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. ఇక, ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందనేది అందరికి తెలిసిందే. అంటే చంద్రబాబు దగ్గర మంచి మార్కులు వేయించుకోటమే కాదు ఆ మార్కులను నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం.

లేకపోతే అల్లాటప్పాగా ఆయ‌న‌ పదవులు ఇచ్చేస్తారు అని అనుకోలేని పరిస్థితి ఉంది. తాజా విషయానికి వస్తే ఆముదాల‌ వలస ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కూన రవికుమార్ కు మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. శ్రీకాకుళం నుంచి అచ్చం నాయుడు మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూన‌ రవికుమార్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్ర నుంచి పార్టీకి బలమైన గుర్తింపు తీసుకురావాలన్నది చంద్ర‌బాబు భావ‌న‌. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి పార్టీని మరింత విస్తృత పరచాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెప్తున్నారు.

కానీ ఆ అవకాశం దాదాపు పోయింది. ఈ విష‌యంపై ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చను బ‌ట్టి ఇటీవల ఓ టీచర్ కు ఫోన్ చేసిన రవికుమార్ బెదిరించార‌న్నది వార్త‌ల్లో వ‌చ్చింది. అయితే నేను బెదిరించలేదు ఆమెను ప్రశ్నించానని ఆయన చెప్తున్నారు. మరోవైపు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు టీచరు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం ప్రణామాలు నేపథ్యంలో కూన రవికుమార్ వివాదానికి లోనయ్యారు. ఫలితంగా చంద్రబాబు తయారు చేసుకున్న జాబితాలో ఆయన పేరు పోయింది అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మరి ఇది ఎంత‌ వరకు నిజమనేది చూడాలి.

ఏదేమైనా చంద్రబాబు దగ్గర పని చేయాలన్నా చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవాలి అన్నా వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం కులం, సామాజిక వర్గం ఆర్థికంగా స్థితిమంతులు కావడం అన్నదే కాకుండా కొద్దిగా ఆటిట్యూడ్‌ను కూడా చంద్రబాబు గమనిస్తున్నారనేది తమ్ముళ్లు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.