మన రోశయ్యకు తెలంగాణా ఘన గౌరవం
కొణిజేటి రోశయ్య. ఆ పేరు చెప్పగానే వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యానాలు ఎన్నో గుర్తుకు వస్తాయి.
By: Tupaki Desk | 4 July 2025 9:12 AM ISTకొణిజేటి రోశయ్య. ఆ పేరు చెప్పగానే వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యానాలు ఎన్నో గుర్తుకు వస్తాయి. శాసన సభలో ఆయన వేసే చెణుకులకు అంతా నవ్వి తీరాల్సిందే. ఆయన హాస్త్య చతురోక్తులకు సభ మొత్తం ఒక్కసారిగా కూల్ కావాల్సిందే. ఆయనకు ఈ రకమైన హాస్యరస పూర్వకమైన సంభాషణా చాతుర్యం ఎలా అబ్బిందో తెలియదు కానీ అదే ఆయనను దిగ్గజ రాజకీయ నేతను చేసింది.
ఆయన రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. అనూహ్యంగా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పదమూడు నెలల పాటు పనిచేశారు. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేవలం మూడు నెలలలోనే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆయన స్థానంలో రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆయన 2011 ఆగస్టు నుంచి 2016 వరకూ అయిదేళ్ళ పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
అంతకు ముందు 1968, 1974, 1980లలో అంటే దాదాపుగా పందొమ్మిదేళ్ళ పాటు ఆయన శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. మధ్యలో ఒకసారి ఎంపీగా రెండు సార్లు ఎమెల్యేగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో అత్యధిక సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య సొంతం.
వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న రోశయ్య 2021 డిసెంబర్ 4న మరణించారు. ఇక రోశయ్య గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన వారు. 1933 జూలై 4న పుట్టిన ఆయన జయంతిని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది ఇది నిజంగా రోశయ్యకు ఇస్తున్న గొప్ప గౌరవంగా చెబుతున్నారు.
రోశయ్య సీమాంధ్రకు చెందిన వారు అయినప్పటికీ ఉమ్మడి ఏపీకి ఆయన మంత్రిగా ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. దాంతో ఆయన సేవలను దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఘన సత్కారాన్ని అందిస్తోంది. రోశయ్య జయంతి వేడుకలు వాడవాడలా ప్రభుత్వం తరఫున జరుగుతాయి. జిల్లా స్థాయిలలో కలెక్టర్లు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి మరీ నివాళి అర్పిస్తారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటారు.
రోశయ్యకు ఈ గొప్ప గౌరవం ఇవ్వడం పట్ల అంతా ఆనందిస్తున్నారు. ఆయన పుట్టిన గుంటూరు నేల అయితే పులకరిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా రోశయ్య జయంతి వేడుకలను అధికారికంగా చేస్తే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్నాయి. అయితే రోశయ్య జీవించినంత కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. దాంతో కూటమిలో బీజేపీ ఉంది. అంతే కాదు ఎన్డీయేకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రత్యర్థి గా ఉంది. దాంతో నిర్వహించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో అని అంటున్నారు.
అయితే రోశయ్య గవర్నర్ గా పదవీ విరమణ అనంతరం కాంగ్రెస్ రాజకీయాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. అంతే కాదు మరణించిన వ్యక్తుల విషయంలో రాజకీయాలు పార్టీలను చూడకూడదని వారి గొప్పతనాన్ని చూడాలని వారి స్పూర్తిని భావి తరాలకు అందించాలని అంటున్నారు ఆ విధంగా చూస్తే కనుక రోశయ్య జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారికంగా నిర్వహించడమే సబబు అన్న మాట వినిపిస్తోంది.