నాగబాబులో అంతులేని వైరాగ్యం...రీజనేంటో ?
ఇక పోస్టులో నాగబాబు రాసిన లైన్లు చూస్తే కనుక చాలానే ఉన్నాయి. ఏది వాస్తవంలో ఏది భ్రమో అర్ధం కాదు, మెదడులో నిక్షిప్తం అయినవన్నీ నిజాలుగా మనసు అద్దం చూపిస్తుంది.
By: Tupaki Desk | 14 May 2025 11:16 PM ISTమెగా బ్రదర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాయకుడు ఇలా ఎన్నో ఆయన పేరుకు ముందు ఉంటాయి. ఆయనే కొణిదెల నాగబాబు. ఆయన ఎపుడూ ఫైర్ బ్రాండ్ మాదిరిగానే ఉంటారు. ట్వీట్లు వేశారంటే పంచులకే పండుగ. సెటైర్లకే సందడి అన్నట్లుగా ఉంటారు.
అలాంటి నాగబాబు సోషల్ మీడియాలో తన ఎక్స్ లో తాజాగా పెట్టిన ఒక పోస్టు అయితే తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్టు కంటే నాగగాబు ఫోటో మరింత వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో నాగబాబు రాళ్ళ గుట్ట మీద కూర్చుని సదూరంగా ఉన్న సాగరాన్ని చూస్తున్నారు. ఆ ఫోటోయే ఎన్నో అర్ధాలు చెబుతోంది.
ఇక పోస్టులో నాగబాబు రాసిన లైన్లు చూస్తే కనుక చాలానే ఉన్నాయి. ఏది వాస్తవంలో ఏది భ్రమో అర్ధం కాదు, మెదడులో నిక్షిప్తం అయినవన్నీ నిజాలుగా మనసు అద్దం చూపిస్తుంది. దాంతో అవే బహుశా నిజాలు అని భ్రమపడుతూంటామని ఆయన రాసుకొచ్చారు.
మనం ఆకలితో ఉన్నపుడు ఆహారం రుచి అద్భుతంగా ఉంటుంది. అదే కడుపు నిండితే ఆ ఆహారమే ఒక సాధారణ రుచిగా మారుతుంది. ఏదీ వాస్తవం కాదు అంతా నీ ఆలోచనలకే నీవు ఎలా అనుకుంటావో అలాగే కనిపిస్తుంది మెదడు ఎపుడూ వాస్తవాలను చూపించదు. నీవు ఏది నిజమని నమ్ముతావో అదే మెదడు కూడా చూపిస్తుంది. అంతా ఆలోచనలలోనే ఉంది అంటూ చాలా కవితాత్మకమైన ధోరణిలో నాగబాబు ఈ పోస్టులో రాసుకొచ్చారు.
దానిని చూసిన నెటిజన్లు నాగబాబు స్వీయ అనుభవమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన పెట్టిన ఫోటో అంతులేని సాగరంలోని ఆయన ఆలోచనాత్మకంగా చూస్తూ ఉండడం ఇవన్నీ చూస్తూంటే నాగబాబు ఏదో చెప్పాలనుకుని ఇలా చెప్పి ఉంటారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కుతుందని అంతా భావించారు. అది కూడా మార్చి 30న ఉగాది వేళ అని ముహూర్తం కూడా పెట్టేసారు. అయితే అది జరిగి రెండు నెలలకు దగ్గర అవుతున్నా ఆ సూచనలు అయితే లేవు. ఉప ముఖ్యమంత్రి పవన్ నాగబాబుకు అండగా ఉండడంతో ఎమ్మెల్సీ కాగలిగారు. మంత్రి పదవి అంటే బాబు కరుణా కటాక్ష వీక్షణాలు కావాలి.
మరి అది ఎపుడు జరుగుతుందో తెలియదు. దాంతో నాగబాబులో అసహనం పెల్లుబుకుతోందా అన్నది కూడా చర్చగా ఉంది. దాంతోనే ఆయన ఈ విధంగా జనరలైజ్ చేస్తూ ఈ తరహా పోస్టు పెట్టి ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి లోతు అయిన భావాలతో నాగబాబు పెట్టిన ఈ పోస్టుతో ఆయనలో వైరాగ్యం ఈ విధంగా ప్రతిఫలించిందా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఈ పోస్టు తరువాత రాజకీయంగా ఏమైనా సమీకరణలు మారుతాయో ఏమో.
