Begin typing your search above and press return to search.

కోనేటి వారి పొలిటిక‌ల్ క‌ష్టాలు ..!

కోనేటి ఆదిమూలం. చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ నాయ‌కుడు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి టీడీపీ లోకి వ‌చ్చి సీటు ద‌క్కించుకుని స‌త్య‌వేడు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2025 6:00 AM IST
కోనేటి వారి పొలిటిక‌ల్ క‌ష్టాలు ..!
X

కోనేటి ఆదిమూలం. చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ నాయ‌కుడు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చి సీటు ద‌క్కించుకుని స‌త్య‌వేడు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌నకు మంత్రివ‌ర్గంలో చోటు వ‌స్తుంద‌ని ఆశించినా.. కొన్ని స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. ఆ త‌ర్వాత‌.. ఓ మ‌హిళ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుని.. తీవ్ర వివాదానికి గుర‌య్యారు. కేసు కూడా న‌మోదైంది. అయితే.. ప్ర‌స్తుతం ఆ కేసు ర‌ద్ద‌యింది. అయినా.. రాజ‌కీయంగా మాత్రం ఆయ‌న‌ను పక్క‌న పెట్టారు.

ఇదే ఇప్పుడు కోనేటికి పెద్ద సంక‌టంగా మారింది. సొంత పార్టీ నేతలపై ఆయ‌న‌ తీవ్రంగా ర‌గిలిపోతున్నారు. వాస్త‌వానికి ఆదిమూలంపై టీడీపీకే చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆయ‌న‌కు క‌ష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ కేసు నుంచి బ‌య‌టప‌డినా.. దాని తాలూకు ప‌ర్య‌వ‌సానాలు మాత్రం ఆయ‌న‌ను వెంటాడుతున్నాయి. అప్పటి నుంచి పార్టీ ఆదిమూలంను పక్కన పెట్టింద‌నేది వాస్త‌వం. దీంతో స్థానికంగా కూడా ఆయ‌న ఇమేజ్ డ్యామేజీ అయింది. ఎంత‌గా అంటే.. టీడీపీ నాయ‌కులు ఎవ‌రూ కూడా ఆయ‌న‌తో ట‌చ్‌లో లేనంత‌గా.

ఈ విషయంపైనే కోనేటి ఆదిమూలం తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన‌.. ఎమ్మెల్యేనే పక్కనపెట్టేస్తారా? అనేది ఆయ‌న సంధిస్తున్న ప్ర‌ష‌శ్న‌. అంతేకాదు.. త‌న ప్ర‌మేయం లేకుండానే క్షేత్ర‌స్థాయిలో కొంద‌రు నేత‌లు.. ప‌నులు చేయించ‌డం.. అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారంచుట్టినా.. క‌నీసం ప్రొటోకాల్ ప్ర‌కారం అయినా.. త‌న‌ను పిల‌వ‌క‌పోవ‌డం వంటివి ఆదిమూలం కు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గ‌ కో-ఆర్డినేటర్, నియోజ‌క‌వ‌ర్గ‌ పరిశీలకుడు పేరుతో చేస్తున్న వ్య‌వ‌హారాల‌పై ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు.

రీజ‌నేంటి ..

కోనేటికి రాజ‌కీయ మిత్రుడు శంకర్ రెడ్డి ఇటీవ‌ల ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. అంతేకాదు.. పార్టీ అధిష్టానం త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింద‌ని చెబుతూ.. ఆయ‌నే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఈ వ్య‌వ‌హార‌మే కోనేటికి మంట‌పుట్టిస్తోంది. రిజర్వ్ నియోజవర్గంలో ఇలా చేయమని సీఎం చంద్రబాబు చెబుతారా? అనేది కోనేటి ప్ర‌శ్న‌. అంతేకాదు.. కొంతమంది గొర్రెల్లాగా ఎవరు వెంటపడితే వారి వెంట వెళ్తున్నార అంటూ.. త‌న అనుచ‌రుల‌పై కూడా అక్క‌సుతో ఉన్నారు. ఇక గ్రూపు రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్నార‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. కోనేటి రాజ‌కీయంగా మైన‌స్ అయ్యార‌న్న‌ది వాస్త‌వం.