Begin typing your search above and press return to search.

వైసీపీ నేత 'కోనేరు' హఠాన్మరణం!

ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో కన్నుమూశారు. 73 ఏళ్ల కోనేరుకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌ లో మృతి చెందారు

By:  Tupaki Desk   |   18 Nov 2023 9:55 AM GMT
వైసీపీ నేత కోనేరు హఠాన్మరణం!
X

ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో కన్నుమూశారు. 73 ఏళ్ల కోనేరుకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌ లో మృతి చెందారు. ఆయనకు భార్య విమలాదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు.

రాజేంద్రప్రసాద్‌ విజయవాడలోని గుణదలలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి కోనేరు మధుసూదనరావు విజయవాడలో గతంలో ప్రముఖ వైద్య నిపుణులుగా ఉన్నారు.

కళాశాల విద్యాభ్యాసాన్ని మధ్యలో వదిలేసిన రాజేంద్రప్రసాద్‌ ఉద్యోగం కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. ఆ తర్వాత సొంతంగా పారిశ్రామికవేత్తగా ఎదిగారు.

అయితే వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మార్‌ కేసులో గోల్ఫ్‌ కోర్సు, విల్లాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారని కోనేరు రాజేంద్రప్రసాద్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులు హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తో సన్నిహిత సంబంధాలు ఉన్న కోనేరు రాజేంద్రప్రసాద్‌ 2014లో విజయవాడ లోక్‌సభ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కోనేరుపై టీడీపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపొందారు.

2014లో ఎంపీగా ఓటమి తర్వాత కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ 2016లో వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం చెన్నైలో కుటుంబంతో కలసి ఉంటున్నారు. హైదరాబాద్‌ లో మృతి చెందిన ఆయన భౌతికకాయాన్ని చెన్నై తరలించారు. బీసెంట్‌నగర్‌ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.