Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు టైం ఇచ్చిన కోదండరాం... వాట్ నెక్స్ట్?

ఈ సందర్భంగా పొత్తు విషయంపై సవివరంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కోదండరాం డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 5:27 PM GMT
కాంగ్రెస్  కు టైం ఇచ్చిన కోదండరాం... వాట్  నెక్స్ట్?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పొత్తుల ముచ్చట తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఏపీలో టీడీపీ - జనసేన పొత్తులో ఉన్నప్పటికీ... తెలంగాణలో మాత్రం విడి విడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే! టీడీపీ 87 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటిస్తుంటే... జనసేన 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - తెజస పొత్తుపై గతకొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ - తెలంగాణ జన సమితి మధ్య పొత్తు చర్చ గతకొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో మల్లు రవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొత్తు విషయంపై సవివరంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కోదండరాం డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తుంది.

మల్లు రవితో భేటీ అయిన అనంతరం కోదండరాం కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... తెలంగాణ జన సమితితో పొత్తుపై 24 గంటల్లో స్పష్టత ఇవ్వాలని కోదండరాం సూచించారు. ఇదే సమయంలో... పొత్తు వ్యవహారం చెప్పిన సమయంలోపు తేల్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని తెలిపారు! దీంతో... కాంగ్రెస్ నేతలు ఈ పొత్తు విషయంపై ఎలా స్పందిస్తారనేదీ ఆసక్తిగా మారింది.

ఆ సంగతి అలా ఉంటే... అంతకముందు, బీఆరెస్స్ తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టో పై స్పందించారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. ఇందులో భాగంగా... బీఆరెస్స్ మేనిఫెస్టోలో కొత్తదనమేమీ లేదని, అంతా పాత చింతకాయ పచ్చడే అని అన్నారు. మేనిఫెస్టో పేరుతో బీఆరెస్స్ మాయాజాలం, కనికట్టు చేస్తోందని విమర్శించారు. వీటిలో జీవిత భీమాను పేదలందరికి వర్తింపజేయడం మాత్రమే చెప్పుకోదగ్గదని అన్నారు.

ఇదే సమయంలో మేనిఫెస్టోలోనూ, అభివృద్ధి విధానాలలోనూ మార్పు తేలేకపోతే ప్రయోజనం లేదని తెలిపిన కోదండరాం... తమ దోపిడిని కొనసాగిస్తూ ప్రజల ఓట్లను పొందడానికి కొన్ని సంక్షేమ పథకాలను తెచ్చి మభ్య పెట్టె ప్రయత్నమే బీఆరెస్స్ మేనిఫెస్టో అని అయన అభివర్ణించారు. దీనివల్ల తాము దోచుకున్న దాని నుండి మనకు జారిపడే తీర్థం బొట్లు పెరుగుతాయి తప్ప అంతకు మించే ఈ మేనిఫెస్టో వలన ఒనగూరే ప్రయోజనం లేదని తెలిపారు.

అదేవిధంగా... పాత స్కీముల కింద ఇచ్చే పథకాల ద్వారా చెల్లించే మొత్తాన్ని పెంచుతామన్న హామీలే కొత్త మేనిఫెస్టోలో ఉన్నాయని.. తెలంగాణాలో సమస్యలు వేరని.. అవి బీఆరెస్స్ చేసిన తప్పిదాల నుండి పుట్టాయని కోదండరాం చెప్పుకొచ్చారు. అందులో అభివృద్ధి విధానాలను కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం తీర్చిదిద్దడం ఒకటని ఆయన తెలిపారు. మొత్తం మీద బీఆరెస్స్ పాలనలో అందరూ చేరి పంచుకొని తింటున్నారని ఆరోపించారు.