తప్పిస్తారా? తప్పుకునేలా చేస్తారా?! మంత్రి సురేఖపై కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉండనుంది?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ క్రమశిక్షణను సురేఖ ఉల్లంఘించారని, ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ సంఘం సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 25 Aug 2026 7:00 PM ISTతెలంగాణ మంత్రి కొండా సురేఖ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ క్రమశిక్షణను సురేఖ ఉల్లంఘించారని, ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ సంఘం సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రి కొండా సురేఖపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి సురేఖ కుమర్తె పరుష విమర్శలు చేయడంతో మొదలైన వివాదం చివరికి మంత్రిని పార్టీ నుంచి సాగనంపే వరకు వచ్చిందని, ఈ చర్యతో పార్టీలో ఇతర నేతలను దారికి తెచ్చుకోవచ్చునని అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సిఫార్సులతో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే సురేఖతో రాజీనామా చేయిస్తారా? లేకపోతే అంతకన్నా కఠినమైన చర్యలు తీసుకుంటారా? అన్నదే సస్పెన్స్ గా ఉందని అంటున్నారు. రాజీనామాకు సురేఖ అంగీకరిస్తే పర్వాలేదని లేనిపక్షంలో ఆమెను బర్తరఫ్ చేసేలా తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే బర్తరఫ్ చేయాలని భావిస్తే ఏ కారణాలు చూపుతారనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. ఇదే సమయంలో ఈ ప్రశ్నకు తగిన సమాధానాలు ప్రభుత్వం సిద్దం చేస్తోందని అంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి మంత్రి సురేఖ అనేక వివాదాల్లో కేంద్ర బిందువుగా ఆరోపణలు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జునతో వివాదం మొదలుకొని ఆమె వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ పై వచ్చిన ఆరోపణలు వరకు అన్నింటిలోనూ సురేఖ వ్యవహారశైలిపై అనేక విమర్శలు చెలరేగాయని అంటున్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై విమర్శలు చేసిన సమయంలో పొరపాటున నాగార్జున కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారని సరిపెట్టుకున్నా, సిమెంటు కంపెనీలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సురేఖ మాజీ ఓఎస్డీపై వచ్చిన ఆరోపణల విషయంలో ఆమె మౌనంగా ఉండటమే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చే పరిస్థితికి కారణమయ్యేలా ఉందని అంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలతోనే ఆమెపై చర్యలకు పార్టీ రెడీ అవుతున్నా, బహిరంగంగా ఆ కారణం చూపే అవకాశాలు లేవని అంటున్నారు. సురేఖ పదవీ గండానికి ఆమె కుమార్తె ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే మూలమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ కారణం చూపకుండా, అంతకంటే బలమైన అంశాలను తెరపైకి తెచ్చేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు. ఇందుకు సోమవారం నాటి పరిణామాలను ఉదహరిస్తున్నారు.
పార్టీ క్రమశిక్షణ సంఘం భేటీకి ముందు మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్టుతోపాటు అటవీశాఖలో ఆరుగురు ఐఎఫ్ఎస్ అధికారుల డెప్యూటేషన్ల రద్దు వంటి పరిణామాల ద్వారా మంత్రిని ఒత్తిడికి గురిచేసే వ్యూహంగా చెబుతున్నారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి రాజీనామాకు సురేఖ సిద్ధం కాకపోతే ఈ కారణాలు చూపి వేటు వేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనా కొన్ని గంటల వ్యవధిలో సురేఖ విషయమై సంచలన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. గౌరవంగా తప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని లేదంటే కఠిన నిర్ణయం తీసుకునే దిశగా చర్యలు ఉంటాయని పార్టీ ఇప్పటికే సంకేతాలు పంపిందనే సమాచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ పెంచేస్తోందని అంటున్నారు.
