కొండా సురేఖ వివాదంలో మరో మంత్రి ఇరుక్కుపోయారా..?
By: Tupaki Desk | 26 Oct 2025 8:30 AM ISTతెలంగాణ ప్రభుత్వంలో ఒక్క కుదుపు కుదిపిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ రచ్చ ముగిసింది. కొండా సురేఖ దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయినా.. తెరవెనక అసలు ఏం జరిగింది ? అన్నదానిపై అసలు నివేదిక ప్రభుత్వం దగ్గర ఉండిపోయిందంటున్నారు. ఇందులో పలు కీలక విషయాలు ఉన్నాయని టాక్ ? కొండా సురేఖ ఎపిసోడ్లో అసలు నిజం ఏమిటి .. దీనికి బాధ్యులు ఎవరు ?బదనమయ్యింది ఎవరు ? సురేఖ తన ఓఎస్డి సుమంత్ ని కారులో ఎక్కించుకుని ఎక్కడికి తీసుకువెళ్లారు ?అన్నదానిపై ఇంటిలిజెన్స్ పూర్తి నివేదిక ప్రభుత్వం వద్ద ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ రిపోర్ట్ లో విషయాలు చూసి ప్రభుత్వ పెద్దలు షాక్ అవుతున్నారట. ఈ ఎపిసోడ్లో మరో బీసీ మంత్రికి కూడా మరక అట్టినట్టు అయిందని అంటున్నారు.
సాధారణంగా ఇలాంటి వివాదాలకు ఆ మంత్రి దూరంగా ఉంటారు. అయితే అనూహ్యంగా ఈ విషయంలో ఎందుకు ? వెలుపెట్టారు అన్న ప్రశ్న ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఓఎస్డి సుమంత్ కోసం కొండా సురేఖ ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చిన రోజు రాత్రి అతడిని తన కారులో ఎక్కించుకొని నేరుగా మినిస్టర్స్ క్వార్టర్స్ కి వెళ్లారట. సురేఖ అక్కడ కూడా తనకు కేటాయించిన భవనంలో కాకుండా.. మరో బీసీ మంత్రి ఇంటికి సుమంత్ ని తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ మంత్రి ఇంట్లోనే సుమంత్‌ను ఆ రాత్రికి ఉంచినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయట. ఆ మంత్రి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు.. వివాదాల జోలికి పెద్దగా వెళ్లరు. అయితే ఇందులో ఎలా ఇరుక్కున్నారు ? అని ఆరా తీస్తే మరో షాకింగ్ మ్యాటర్ వెలుగు చూసిందట.
కొండా ఓఎస్డి సుమంత్ ను ఈ రాత్రికి మీ దగ్గరే ఉండనివ్వాలని తెలంగాణలో కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన పదవి నిర్వహిస్తున్న ఓ సీనియర్ లీడర్ సూచించినట్టు తెలుస్తోంది. ఆ కీలక వ్యక్తి ఫోన్ చేయడంతో వివాదరహితుడు అయిన ఆ బీసీ మంత్రి సుమంత్ కు ఆ రోజు రాత్రి తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చినట్టు ఇంటెలిజెంట్ రిపోర్టులో క్లియర్‌గా ఉన్నట్టు సమాచారం. కొండా సురేఖ దంపతులు రేవంత్ రెడ్డిని కలిసి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ఏమాత్రం సంబంధంలేని ఈ బీసీ మంత్రి అనూహ్యంగా ఈ ఎపిసోడ్లో ఇరుక్కుపోయారు. ఒక్కసారిగా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వ పెద్దలకు ఇచ్చిన నివేదికలో తన పేరు కూడా ఉందన్న విషయం తెలుసుకున్న ఆ మంత్రి ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నట్టు తెలుస్తోంది.
