వేలిముద్రగాళ్లు సీఎంలు అవుతారు.. మంత్రి కొండా ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
By: A.N.Kumar | 18 Feb 2026 1:44 PM ISTతెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చకు దారి తీసిన ఆమె.. తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. “రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా ముఖ్యమంత్రులు అవుతారు.. కానీ ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలంటే కష్టపడి చదవాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.
మంగళవారం ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్.సీఆర్ఐ) 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ.. విద్య, పరిపాలన, రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఐఏఎస్, ఐపీఎస్‌లపై వ్యాఖ్యలు
మంత్రి సురేఖ మాట్లాడుతూ.. “ఐఏఎస్, ఐపీఎస్‌లు కావడం అంత సులువు కాదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదవాలి. జ్ఞానం సంపాదించాలి. పోటీ పరీక్షలు రాసి అర్హత సాధించాలి. కానీ రాజకీయాల్లో అలాంటి అర్హతలు అవసరం ఉండవు. వేలిముద్ర వేసే వాళ్లు కూడా ముఖ్యమంత్రులు అవుతారు” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా “ఎంత కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్‌లు అయినా చివరికి రాజకీయ నాయకులు చెప్పినదే చేయాల్సి వస్తుంది” అని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వ్యవస్థపై తీవ్ర విమర్శగా భావించబడుతున్నాయి.
రాజకీయాల్లో దుమారం
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రజల ఓట్లతో ఎన్నికైన నాయకులను “వేలిముద్రగాళ్లు”గా అభివర్ణించడం సరైనదేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇక సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సురేఖ వ్యాఖ్యల్లో నిజం ఉందని అంటుంటే.. మరికొందరు ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయని విమర్శిస్తున్నారు.
వివాదాలకు కేంద్రబిందువేనా?
మంత్రి సురేఖ గతంలో కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి చేసిన వ్యాఖ్యలు ఆమెను వివాదాల మధ్య నిలబెట్టాయి. “మాంసం తింటామని ఎముకలు మెడలో వేసుకొని తిరుగరు” అన్నట్లుగా.. అందరికీ తెలిసిన విషయాలను బహిరంగంగా చెప్పడం అవసరమా? అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ తరహా వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎఫ్‌సీఆర్‌ఐపై ప్రశంసలు
అయితే అదే వేదికపై మంత్రి సురేఖ ఎఫ్‌సీఆర్‌ఐ సంస్థ పనితీరును ప్రశంసించారు. గత పది సంవత్సరాల్లో తెలంగాణ హరితాభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో ఈ సంస్థ ముందంజలో ఉందని పేర్కొన్నారు.
అభివృద్ధి హామీలు
సంస్థలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం, సీనియర్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టడం, మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడం కోసం అవసరమైన ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. ఆ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థులకు సూచనలు
ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి సురేఖ కీలక సూచనలు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఫారెస్ట్రీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. నిజాయితీగా మాట్లాడిన వ్యాఖ్యలా? లేక అనవసర వివాదానికి కారణమైన మాటలా? అన్నది పక్కన పెడితే.. ఈ వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచిన విషయం స్పష్టమే. ఇకపై ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
