సురేఖ శాఖలో డబ్బులు రావడం లేదు.. రేవంత్ రెడ్డిని ఇరుకనపెట్టేసిన కొండా మురళి!
పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొండా మురళి.
By: Tupaki Desk | 20 Jun 2025 4:51 PM ISTతెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నేత కొండా మురళి ఇరకాటంలో పడేశారు. తన సతీమణి, దేవాదాయ మంత్రి కొండా సురేఖకు కనీస ఆదాయం రావడం లేదని, ఆమె ఖర్చులకు తానే నెలకు రూ.5 లక్షలు ఇస్తున్నట్లు కొండా మురళి వ్యాఖ్యానించడం వైరల్ గా మారింది. గతంలో కొందరు మంత్రులు డబ్బులు తీసుకుని పనులు చేస్తుంటారని సురేఖ దుమారం రేపారు. ఆ వివాదం ఏదో రకంగా సర్దుమణిగించిన కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంటుందని అనగా, తాజాగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి.
తన సతీమణి శాఖలో డబ్బు రావడం లేదన్న వ్యాఖ్యలతోపాటు సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపైనా కొండా మురళి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆ ఇద్దరు ముందు తెలుగుదేశం పార్టీని ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ను భ్రష్టు పట్టించారని విమర్శించారు మురళి. దీంతో ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారని అంటున్నారు. కొండా మురళి వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె సుష్మిత పోటీ చేస్తుందని ఏకపక్షంగా ప్రకటించారు. పరకాలలో 75 ఏళ్ల నాయకుడు ఒకరు నా దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చేసారి మీకు వదిలేస్తానని చెప్పారు అంటూ మురళీ వెల్లడించారు. అదే సమయంలో మాజీ మంత్రి కడియం శ్రీహరిని ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా అభివర్ణించారు. వీరిద్దరూ గతంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. దీంతో మురళి వారి పేర్లు ప్రస్తావించకపోయినా, టీడీపీ, బీఆర్ఎస్ ను భ్రష్టుపట్టించారని చెప్పడంతో పార్టీలో కలకలం చెలరేగింది.
మురళి వ్యాఖ్యలు వైరల్ కావడంతో హన్మకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో మిగిలిన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కడియం, రేవూరితోపాటు ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, బస్వరాజు సారయ్య, సుధారాణి హాజరయ్యారు. మురళి వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు ఎమ్మెల్యేల సమావేశం, మురళి వ్యాఖ్యలపై పార్టీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు చెబుతున్నారు.
