Begin typing your search above and press return to search.

కొణతాల కిమిడి జీవిత కాల కోరిక తీరుతుందిట !

అనకాపల్లి జిల్లా అనకాపల్లి శాసనసభ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచారు కొణతాల రామకృష్ణ.

By:  Tupaki Desk   |   24 July 2025 9:00 AM IST
కొణతాల కిమిడి జీవిత కాల కోరిక తీరుతుందిట !
X

ఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ మోస్ట్ లీడర్లుగా మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, కిమిడి కళా వెంకటరావు ఉన్నారు ఈ ఇద్దరూ కూటమిలో ఉన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి శాసనసభ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచారు కొణతాల రామకృష్ణ. ఆయన 2004 తరువాత ఇరవై ఏళ్ల తరువాత మళ్ళీ అనకాపల్లిలో గెలిచారు. ఆయన 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినపుడు వైఎస్సార్ సీఎం. దాంతో ఆయనకు అయిదేళ్ళ పాటు కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కాయి. ఆనాటి ఉమ్మడి విశాఖ జిల్లాను ఆయన ఒంటి చేత్తో ఏలారు.

అలా కొణతాల రాజకీయ వైభవం అప్పట్లో సాగింది. వైఎస్సార్ మరణం తరువాత మాత్రం ఆయత చాలా కాలం ఇబ్బందులు పడ్డారు. వైసీపీలో వెళ్ళి బయటకు వచ్చేశారు. టీడీపీలో కూడా కొద్ది కాలం పనిచేశారు. ఇక 2019 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కొణతాలకు 2024 లో జనసేన పిలిచి టికెట్ ఇవ్వడంతో దశ తిరిగింది. ఆయన మొదట్లోనే మంత్రి అవుతారని అనుకున్నారు.

కానీ విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తున్నారు అని చెబుతున్నారు. దాంతో కొణతాల వర్గీయులలో ఆనందం వెల్లి విరుస్తోందిట. అలాగే మరో సీనియర్ నేత విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గెలిచిన కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఆయనకు కూడా మంత్రి పదవి దక్కుతుందని చెబుతున్నారు. 2019లో ఓటమి చెందిన తరువాత కళా రాజకీయ జీవితం కళా విహీనం అయిపోయింది.

ఇక 2024లో ఆయన మంత్రిగా చేస్తాను అంటేనే పోటీ అని ముందే చెప్పారని టాక్ నడచింది. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించిన కళా వెంకటరావుకు ఇన్నాళ్ళకు మంత్రి యోగం దక్కబోతోంది అని అంటున్నారు. ఒక వైపు పూసపాటి రాజు అశోక్ గోవా గవర్నర్ గా నియమితులు కావడంతో విజయనగరం జిల్లాను మొత్తానికి ఏకతాటి మీద నడపాల్సిన బాధ్యతలు కూడా కళా వెంకట్రావు మీద ఉన్నాయని అందుకే ఈ సీనియర్ ని ఏరి కోరి మరీ మంత్రిగా చేస్తారు అని అంటున్నారు.

ఇదే లాస్ట్ చాన్స్ అని కళా వెంకటరావు కొణతాల ఈసారి ఎన్నికల గోదాలోకి దిగారు. ఇపుడు వారికి జీవితకాలం సరిపడా అచీవ్ మెంట్ మంత్రి పదవి రూపంలో దక్కబోతోంది అని అంటున్నారు. అదే సమయంలో ఈ ఇద్దరికీ కనుక మంత్రులుగా అవకాశాలు దక్కితే మాత్రం ఉత్తరాంధ్రాలో కూటమి రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతుందని అంటున్నారు. పవన్ దృష్టిలో కొణతాల బాబు దృష్టిలో కిమిడి ఫిక్స్ అయిపోయారని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో చూడాల్సి ఉంది.