డజను పెళ్లిళ్లు అబద్ధం.. పోలీసులు ముందుకొచ్చిన నీలిమ!
అవును... తనపై "నిత్య పెళ్లి కూతురు, 12 పెళ్లిళ్లు చేసుకుంది" అంటూ జరుగుతున్న ప్రచారంపై నీలిమ అనే యువతి మీడియా ముందుకు వచ్చారు.
By: Tupaki Desk | 25 Jun 2025 10:58 AM ISTకోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుందని.. ఈ నేపథ్యంలో బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని.. ఈమె అత్యంత పకడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసి మరీ విడాకులు పొంది, ఆర్థికంగా స్థితిమంతులైన మగవారిని టార్గెట్ చేసుకుని, పెళ్లి చేసుకుంటుందని ప్రధాన మీడియాలో కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ అనే యువతి.. తన తల్లి, మరో ఇద్దరి సహకారంతో విడాకులు తీసుకుని డిప్రషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుని, వివాహం చేసుకుంటుందని.. కొంత కాలం తరువాత అందినంత సొమ్ము లాగేస్తుందని కథనాలొచ్చాయి. ఈ క్రమంలో సుమారు 12 పెళ్లిళ్లు చేసుకున్నట్లు కథనాలొచ్చాయి. అయితే అదంతా అబద్ధం అంటూ నీలిమ మీడియా ముందుకు వచ్చారు.
అవును... తనపై "నిత్య పెళ్లి కూతురు, 12 పెళ్లిళ్లు చేసుకుంది" అంటూ జరుగుతున్న ప్రచారంపై నీలిమ అనే యువతి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా... తనపై జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టాలని కోరుతూ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు ఎవరి నుంచి సహాయం దొరకలేదని వాపోయారు.
ఇప్పటికే కొంతకాలంగా తన జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించిన నీలిమ... న్యాయం కోసం పలువురు రాజకీయ నాయకులను ఆశ్రయించినా ఫలితం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పరువు, గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలతో వెనక్కి తగ్గే మనిషిని కాదని చెప్పుకొచ్చారు.
తనపై చేసిన ఆరోపణలు నిజం కాకపోయినా వాటి వల్ల తనకు తీవ్రంగా నష్టం జరిగిందని.. ఎవరు ఇలా చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు అనేది త్వరలో బయట పడుతుందని.. అప్పటి వరకు తన పోరాటం ఆగదని ఆమె తెలిపారు. తనకు 12 పెళ్లిళ్లు అయ్యాయి అంటున్నవారు వాటిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలని ఆమె కోరారు!
