Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్‌ లో కోనసీమ వాసులు.. తాజా పరిస్థితులపై ఏమి చెప్పారంటే..?

అవును... పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య సుమారు ఎనిమిది రోజులుగా యుద్ధం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   20 Jun 2025 8:52 AM IST
ఇజ్రాయెల్‌ లో కోనసీమ వాసులు.. తాజా పరిస్థితులపై ఏమి చెప్పారంటే..?
X

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. పైగా ఈ యుద్ధం రోజు రోజుకీ ముదిరిపోతోంది. మరోవైపు ఇరాన్ లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ లోని జనావాసాలపై క్షిపణులను ప్రయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది! ఈ సమయంలో కోనసీమ జిల్లా వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అవును... పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య సుమారు ఎనిమిది రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఈ భీకర యుద్ధం నేపథ్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం చాలా మంది అక్కడ ఉంటున్నారు.

వాస్తవానికి ఈ ప్రాంతాల నుంచి గల్ఫ్‌ దేశాలలో కూడా ఎక్కువమంది ఉంటారు. కొన్ని దశాబ్ధాలుగా ఇది నడుస్తోంది! అయితే.. గల్ఫ్ కంట్రీస్ తో పోలిస్తే.. ఇజ్రాయెల్‌ లో వేతనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో.. చాలామంది అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే కఠిన నిబంధనల కారణంగా తక్కువ మందికే అవకాశం లభిస్తోంది.

ఈ విషయాలపై తాజాగా స్పందించిన అధికారులు.. ప్రభుత్వం ఆదేశిస్తే క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలు సేకరించి పంపిస్తామని.. ఉపాధి నిమిత్తం అక్కడికి వెళ్లినవారు 58 మంది వరకు ఉంటున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ లెక్కలు కరెక్ట్ కాదని.. ఒక్క సఖినేటిపల్లి, మలికిపురం మండలాలకు చెందినవారే సుమారు 300 మంది వరకు ఉన్నారని అంటున్నారు స్థానికులు.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ లో ఉన్న సఖినేటిపల్లి వాసులు పలువురు వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా... దాడులు జరుగుతాయన్న సంకేతాలు రాగానే నతానియా ప్రాంతంలోని బంకర్లలోకి వెళ్లిపోతున్నామని.. అందులో 20 - 25 మంది వరకు ఉంటున్నామని.. పరిస్థితి ప్రశాంతంగా మారిన తర్వాతనే బయటకొచ్చి పనులు చేసుకుంటున్నామని తెలిపారు.

ఇజ్రాయెల్ నుంచి ఆపరేషన్ సింధు:

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ లో చిక్కుకున్న వారిని తరలించేందుకు ఆపరేషన్‌ సింధు చేపట్టిన భారత ప్రభుత్వం.. ఇజ్రాయెల్‌ లో ఉన్నవారిని సైతం స్వదేశానికి తరలించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా... భారత్‌ కు వచ్చేయాలనుకుంటున్న పౌరుల్ని తరలించేందుకు టెల్‌ అవీవ్‌ లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.

ఇందుకు సంబంధించి ఏవైనా సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్‌ రూమ్‌ ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా... +972 54-7520711; +972 54-3278392 నెంబర్లను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌ లో ఉన్న భారతీయ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, ఇజ్రాయెల్‌ అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరింది.