కొమ్మినేని లైవ్ షో రీస్టార్ట్.. సుప్రీం ఏం చెప్పింది? టీడీపీ ప్రచారం ఉత్తదేనా!
ఈ నేపథ్యంలో కొమ్మినేనిని అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది.
By: Tupaki Desk | 18 Jun 2025 7:38 AMసాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు తన కేఎస్ఆర్ లైవ్ షోలో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఇటీవల ఏపీ పోలీసులు కొమ్మినేనిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సూచనలతో రెండు రోజుల క్రితం మంగళగిరి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో ఆయన మళ్లీ టీవీ షోలు చేయకూడదని కోర్టు షరతులు విధించినట్లు టీడీపీ మీడియా ప్రచారం చేసింది. హోంమంత్రి అనిత కూడా మీడియాతో మాట్లాడుతూ కేఎస్ఆర్ డిబేట్లు నిర్వహించొద్దని న్యాయస్థానం ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.
అయితే, కొమ్మినేని మాత్రం జైలు నుంచి విడుదలైన తర్వాత రెండు రోజులకే సాక్షి చానల్ కు వచ్చారు. బుధవారం ఉదయం 6 గంటలకు ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షోను ఎప్పటిలానే కొనసాగించారు. అయితే ముందు తన అరెస్టు పట్ల మాట్లాడిన కొమ్మినేని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 70 ఏళ్ల వయసులో తనను అన్యాయంగా అరెస్టు చేశారని, జీవిత చరమాంకంలో చేయని తప్పునకు నింద మోస్తున్నానని కన్నీటిని పెట్టుకున్నారు. తనకు అన్ని విధాలుగా అండదండగా నిలిచిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి, భారతీరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఇక 1975లో సీఎం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలోనే తాను జర్నలిజంలోకి వచ్చానని చెప్పిన కొమ్మినేని తన పట్ల కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు అనరాని మాటలు అన్నారని ఆరోపించారు. తన ఊపిరి పోతుందేమో అని భయపడినట్లు తెలిపారు. ఈ నెల 6న సాక్షి చానల్ లో కొమ్మినేని నిర్వహించిన లైవ్ షోలో విజయవాడకు చెందిన జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కొమ్మినేని ఖండించకపోగా, మరింత ప్రోత్సహించేలా వ్యవహరించారని ప్రభుత్వం ఆయనపై అభియోగాలు మోపింది.
ఈ నేపథ్యంలో కొమ్మినేనిని అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తన అరెస్టు బావ ప్రకటన స్వేచ్ఛకు విగాతంగా పేర్కొంటూ కొమ్మినేని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా దిగువ కోర్టును సూచిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో మంగళగిరి కోర్టులో కొన్ని షరతులతో కొమ్మినేనికి బెయిల్ మంజూరైంది. ఆ సమయంలో కొమ్మినేని మళ్లీ టీవీ డిబేట్లు చేయకూడదని కోర్టు తీర్పు ఇచ్చిందని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం, దీనిని బలపరుస్తూ హోంమంత్రి అనిత మాట్లాడటం కొమ్మినేని లైవ్ షో మరి జరగదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే కొమ్మినేని తన ప్రొగ్రాంను కంటిన్యూ చేయడంతో టీడీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారంలో నిజం లేదని అంటున్నారు.