పాపం వారికి ఆ విషయం తెలియదేమో.. పవన్, లోకేశ్ పై సాక్షి జర్నలిస్టు కొమ్మినేని సెటైర్లు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత, మంత్రి లోకేశ్ పై సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 16 Aug 2025 3:30 PM ISTడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత, మంత్రి లోకేశ్ పై సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ అవగాహన లేదంటూ KSR లైవ్ షో కొమ్మినేని వ్యాఖ్యానించారు. ‘‘అంటే వాళ్లకు అంత నాలెడ్జి ఉండకపోవచ్చు. పాపం కొత్తగా వచ్చారు కదా’’ అంటూ తనదైన స్టైల్ లో కొమ్మినేని వ్యాఖ్యానించం చర్చనీయాంశం అవుతోంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీలో స్త్రీశక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షి చానల్ లో శనివారం ఉదయం KSR లైవ్ షోలో డిబేట్ జరిగింది. ఈ సందర్భంగా ఓ కాలర్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవడాన్ని ప్రస్తావించారు.
కాలర్ లేవనెత్తిన ప్రశ్న
ఆర్టీసీ బస్సుల్లో ప్రజాప్రతినిధులు ఉచితంగా ప్రయాణించడం 1970, 1980 కాలం నుంచి వస్తోంది. కానీ, సహాదరులుగా చెప్పుకుంటున్న పవన్, లోకేశ్ షో కోసం డబ్బులు చెల్లించి పబ్లిసిటీ చేసుకుంటున్నారని KSR లైవ్ షోలో ఆ కాలర్ విమర్శలు గుప్పించాడు. దీనిపై స్పందించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని స్త్రీశక్తి ప్రారంభం సందర్భంగా పవన్, లోకేశ్ టికెట్ డబ్బు చెల్లించి ప్రయాణించడం తనకు తెలియనట్లు మాట్లాడారని చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉచితంగా ప్రయాణించొచ్చు. కండెక్టర్ పక్కనే వారికి సీటు కేటాయిస్తారు. బస్సులో ఆ విషయాన్ని స్పష్టంగా రాస్తారు. ఇప్పుడు రాస్తున్నారో లేదో తనకు తెలియదని చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన పవన్, లోకేశ్ కు ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యేలు ఉచితంగా ప్రయాణించొచ్చు అన్న విషయంపై నాలెడ్జి లేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో కొమ్మినేని మాట్లాడిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.
ఎందుకంత ప్రాధాన్యం అంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టు అయిన కొమ్మినేని సాక్షి టీవీలో KSR లైవ్ షో నిర్వహిస్తుంటారు. కొద్ది రోజుల క్రితం విజయవాడకు చెందిన జర్నలిస్టు కృష్ణంరాజు KSR లైవ్ షోకు గెస్టుగా వెళ్లి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర వివాదం చెలరేగగా, కొమ్మినేనిపైనా కేసులు నమోదుచేసి పోలీసులు అరెస్టు చేశారు. అయితే కొమ్మినేని అరెస్టును తప్పుబట్టిన సుప్రీంకోర్టు ఆయనకు వెంటనే బెయిలు మంజూరు చేసింది. దీంతో కొమ్మినేని లైవ్ షోపై అందరిలోనూ ఆసక్తి కూడా పెరిగింది. ఇక తాజా ఎపిసోడ్ లో తన అనుభవంతో పవన్, లోకేశ్ డబ్బులు చెల్లించి ప్రయాణించడాన్ని ఒకింత వ్యంగ్యంగా కొమ్మినేని ప్రస్తావించారు. దీనిపై వివాదం లేకపోయినా కూటమి ప్రభుత్వంలో కీలక నేతలుగా చక్రం తిప్పుతున్న ప్రముఖ నేతలకు నాలెడ్జ్ లేదని, పాపం కొత్తగా ఎన్నికయ్యారు కదా? అంటూ కొమ్మినేని సెటైర్లు వేయడమే చర్చకు దారితీస్తోంది. కొమ్మినేని వ్యాఖ్యలను వైసీపీ వైరల్ చేస్తుండగా, టీడీపీ సోషల్ మీడియా కౌంటరు రెడీ చేస్తోందని చెబుతున్నారు.
ఏం జరిగింది?
విజయవాడలో స్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సీఎం నివాసం ఉన్న ఉండవిల్లి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ బస్టాండ్ కు వచ్చారు. ముందుగా ఉండవిల్లి సెంటర్ లో బస్సు కోసం వేచిచూసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్, మాధవ్ ఆ తర్వాత బస్సులో సుమారు 50 నిమిషాలు ప్రయాణించి విజయవాడ బస్టాండ్ కు చేరుకున్నారు. సాధారణ ప్రయాణికులుగా సీఎం, డిప్యూటీ సీఎం ఇతర ప్రయాణికులతో కలిసి ప్రయాణించడం, మహిళలతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలను తెలుసుకోవడం వైరల్ అయింది. అదే సమయంలో రాష్ట్రంలో రెండున్నర కోట్ల మందికి ఉపయోగపడే పథకం కావడంతో ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి విస్తృత కవరేజ్ ఇచ్చింది. దీంతో వైసీపీ రాజకీయ విమర్శలను ఎక్కుపెట్టింది.
వైసీపీ బాధ దేనికి?
14 నెలలు ఆలస్యంగా ప్రారంభించి, పరిమిత సంఖ్యలో బస్సులకు మాత్రమే ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నారని ఆక్షేపిస్తున్న వైసీపీ.. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారని ఆరోపిస్తుంది. హైఎండ్ బస్సులు, ఏసీ, డీలక్స్ బస్ సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సందర్భంలోనే కొమ్మినేని నిర్వహించిన KSR లైవ్ షోలో డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ లకు అవగాహన లేదన్న కొమ్మినేని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్, లోకేశ్ డబ్బు చెల్లించి ప్రయాణించడమే ఇంతవరకు గొప్పగా ప్రచారం జరగగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండగా, డబ్బు చెల్లించడం ఎందుకు? అన్న కొమ్మినేని ప్రశ్నతో ఔను కదా? అని అంటున్నారు.
