Begin typing your search above and press return to search.

పార్టీ మార్పును కొట్టిపారేయ‌ని కోమ‌టిరెడ్డి..తెలివిగా అవుననే జ‌వాబు

తాజాగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి భ‌విష్య‌త్తులో కాంగ్రెస్ గూటికి చేర‌బోతున్నారా అనే విష‌యంలో కీల‌క కామెంట్లు చేశారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 1:52 PM GMT
పార్టీ మార్పును కొట్టిపారేయ‌ని కోమ‌టిరెడ్డి..తెలివిగా అవుననే జ‌వాబు
X

తెలంగాణ రాజ‌కీయాలు ఫుల్ కాక‌మీద‌కు చేరిన సంగ‌తి తెలిసిందే. అధికార బీఆర్ఎస్ పార్టీ స‌హా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీలు త‌మ దూకుడును కొన‌సాగిస్తున్నాయి. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ నేత‌లు ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్నారు. ఈ స‌మ‌యంలో నేత‌లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ విష‌యంలో కీల‌క అడుగులు వేస్తున్నారు. తాజాగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి భ‌విష్య‌త్తులో కాంగ్రెస్ గూటికి చేర‌బోతున్నారా అనే విష‌యంలో కీల‌క కామెంట్లు చేశారు. కాదు అన‌కుండానే అవును అనే జ‌వాబు ఇచ్చేశారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించి అధికార‌, రాజ‌కీయ ప్ర‌సంగాలు చేశారు. కీల‌క‌మైన ప‌లు హామీల‌కు మోక్షం క‌ల్పించారు. అయితే ఇంత‌టి ముఖ్య‌మైన ప్రధాని నరేంద్ర మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రధాని మోడీ సభలో కన్పించడకపోవడం చర్చనీయంశంగా మారింది. అయితే, త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన రాజ‌గోపాల్ రెడ్డి అందులో భాగంగానే ప్ర‌ధాని స‌భ‌ను లైట్ తీసుకున్నార‌ని చెప్తున్నారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్లు సైతం ఈ విష‌యాన్ని రూడీ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ప్రధాని మోడీ సభకు బీజేపీలో ఉన్నప్ప‌టికీ రాజగోపాల్‌ రెడ్డి వెళ్లక‌పోవ‌డం వెనుక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వ‌స్తున్న సిగ్న‌ల్స్ అని చెప్తున్నారు. బీజేపీలో త‌న‌కు భవిష్యత్తు లేదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న రాజ‌గోపాల్ రెడ్డి, తన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను తేల్చే పనిలో ఉన్న ఎంపీ వెంకట్‌ రెడ్డి.. తన తమ్ముడిని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని చూస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాజ‌గోపాల్ రెడ్డి కామెంట్లు సైతం దీనికి ఆజ్యం పోస్తున్నాయి. మర్రిగూడలో పర్యటించిన రాజగోపాల్‌ రెడ్డి.. తాను పార్టీ మారుతానని గత ఆరు నెలలుగా ప్రచారం జరుగుతుందనే విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. దీనిపై తాను త్వరలోనే క్లారిటీ ఇస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే, తాను బీజేపీని వీడ‌టం లేద‌ని.... కాంగ్రెస్‌లో చేర‌డం లేద‌ని చెప్ప‌క‌పోవ‌డం చూస్తుంటే ఆయ‌న కాంగ్రెస్ వైపు చూస్తుండ‌టంలో వాస్త‌వం ఉంద‌ని, త్వ‌ర‌లోనే చేరిక ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.