Begin typing your search above and press return to search.

రేవంత్ తో విభేదాలు లేవు.. మంత్రి కోమటిరెడ్డి

పార్టీ సీనియర్ నేత వెంకటరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు సీఎం కావాలనే కల ఏనాడు లేదని పేర్కొన్నారు. పార్టీ అభ్యున్నతి కోసమే తాను పాటుపడ్డానని చెప్పారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 9:00 AM GMT
రేవంత్ తో విభేదాలు లేవు.. మంత్రి కోమటిరెడ్డి
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు పార్టీ సీనియర్ నేతలు తిరుగు బావుటా ఎగురవేశారు. సీనియర్లను కాదని జూనియర్లకు పదవి కట్టబెట్టారని అలక బూనారు. వీటన్నింటిని అధిష్టానం పరిశీలించినా రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. దీంతో ఆయన ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తనవంతు ప్రచారం నిర్వహిస్తూ పార్టీని ముందుకు నడిపించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఢిల్లీ నేతల అల్టిమేటంతో దిగి వచ్చినా రేవంత్ రెడ్డికి మాత్రం సహకరించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత అగాధంలో పడిపోయింది. అయినా రేవంత్ రెడ్డి ధైర్యం చెడలేదు. పార్టీని ముందుండి నడిపించారు. విజయ తీరాలకు చేర్చారు. పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో ఎవరు సీఎం అవుతారనే ఉత్కంఠ కూడా నెలకొంది. కానీ అధిష్టానం రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగించడం గమనార్హం.

కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరికి సీఎం కావాలనే ఆశ లోపల ఉందని తెలుసు. కానీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి తలవంచారు. పార్టీ సీనియర్ నేత వెంకటరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు సీఎం కావాలనే కల ఏనాడు లేదని పేర్కొన్నారు. పార్టీ అభ్యున్నతి కోసమే తాను పాటుపడ్డానని చెప్పారు. పార్టీ ప్రయోజనాల కోసం దేనికైనా రెడీ అని తెలిపారు.

రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు ఆశించారు. దీంతోనే కాంగ్రెస్ కు పట్టం కట్టారు. రెండేళ్లలో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి ప్రభుత్వం మీద విశ్వాసం పెంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కాపాడుకోవాలి. లేకపోతే నమ్మకం కోల్పోతే మళ్లీ పూర్వ పరిస్థితి వస్తే చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో పార్టీ మంచి స్థానం నిలబెట్టుకోవాలంటే ఇచ్చిన హామీలు నెవరేర్చడమే తక్షణ కర్తవ్యం.

బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ప్రజలు మనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మంచి పాలన అందించి మనమేమిటో నిరూపించుకోవాలి. ఇందుకోసం అందరు పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే విధంగా పాలన అందించాల్సిన అవసరం ఉందని గుర్తించాలని చెబుతున్నారు.