Begin typing your search above and press return to search.

రేవంత్‌ రెడ్డి సీఎం పదవిపై కోమటిరెడ్డి హాట్‌ కామెంట్స్‌!

నల్గొండలో రంజాన్‌ వేడుకల్లో ముస్లింలతో కలిసి పాల్గొన్న కోమటిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఏక్‌ నాథ్‌ షిండేలు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   11 April 2024 11:30 AM GMT
రేవంత్‌ రెడ్డి సీఎం పదవిపై కోమటిరెడ్డి హాట్‌ కామెంట్స్‌!
X

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ ఏక్‌ నాథ్‌ షిండేలు ఉన్నారని.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేది కాంగ్రెస్‌ పార్టీ నేతలేనని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి కూడా హాట్‌ కామెంట్స్‌ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీని సంప్రదించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు.

తాజాగానూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. నల్గొండలో రంజాన్‌ వేడుకల్లో ముస్లింలతో కలిసి పాల్గొన్న కోమటిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఏక్‌ నాథ్‌ షిండేలు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని.. రేవంత్‌ రెడ్డి పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలో గ్రూపులు లేవని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత విషయాలు వారికెందుకని నిలదీశారు. తమ పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని హెచ్చరించారు. మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు.

ఏక్‌ నాథ్‌ షిండేను బీజేపీనే సృష్టించిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని స్పష్టం చేశారు. ఆ పార్టీ ఒక్క సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ 14 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలే నిదర్శనమని చెప్పారు.

ఇప్పటికైనా హరీష్‌ రావు, మహేశ్వర్‌ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. పనికి రాని మాటలు, చిట్‌ చాట్‌లు బంద్‌ చేస్తే మంచిదన్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత మహేశ్వర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన ఘాటు కౌంటర్‌ ఇచ్చారు.