Begin typing your search above and press return to search.

మంత్రి కోమ‌టిరెడ్డి అలిగారా? కాంగ్రెస్‌లో చ‌ర్చ‌!

``ఇంత జ‌రిగిందా.. అంత జ‌రిగిందా.. నాకేం తెలుసు. ఏదైనా ఉంటే వారినే అడ‌గండి`` అంటూ.. వెంక‌ట‌రెడ్డి వ్యాఖ్యానించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

By:  Garuda Media   |   30 Oct 2025 1:00 AM IST
మంత్రి కోమ‌టిరెడ్డి అలిగారా?  కాంగ్రెస్‌లో చ‌ర్చ‌!
X

తెలంగాణ‌లోని రేవంత్ రెడ్డి స‌ర్కారులో మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నది 14 మంది. అయితే.. వీరిలో న‌లుగురు నుంచి ఆరుగురు వ‌ర‌కు వివాదాల్లో మునిగి తేలుతున్నార‌న్న చ‌ర్చ‌సాగుతోంది. మంత్రులు కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, సీత‌క్క‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఇలా.. కొంద‌రు మంత్రులు వివాదాలు.. గిల్లిక‌జ్జాల చుట్టూ తిరుగుతున్నారు. వారిని స‌ముదాయించ‌లేక‌.. వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌లేక అటు పార్టీ అధిష్టానం.. ఇబ్బంది ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్పుడు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వంతు వ‌చ్చింద‌నే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో సాగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణ సినిమాటో గ్ర‌ఫీ మంత్రిగా ఉన్నారు. సో.. సినిమా రంగానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు, నిర్ణ‌యాలు వంటివి ఆయ‌నే చూడాలి. అయితే.. త‌న ప్ర‌మేయం లేకుండానే నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌న్న బాధ‌ కోమ‌టిరెడ్డిలో క‌నిపిస్తోంద‌ని ప‌లువురు నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. గ‌తంలో కూడా ఓ కీల‌క సినిమా విష‌యంలో

``ఇంత జ‌రిగిందా.. అంత జ‌రిగిందా.. నాకేం తెలుసు. ఏదైనా ఉంటే వారినే అడ‌గండి`` అంటూ.. వెంక‌ట‌రెడ్డి వ్యాఖ్యానించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

ఆ త‌ర్వాత సినిమా టికెట్ల వ్య‌వ‌హారం.. చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న మౌనంగా ఉన్నారు. ``మాలాంటోళ్లు ఏమైనా మాట్లాడితే.. ఇబ్బంది అవుతుంది. అందుకే గ‌మ్మున ఉంటున్నాం.`` అని అన్నారు. ఇక‌, ఇప్పుడు మంగ‌ళ‌వారం జ‌రిగిన సినీ ఆర్టిస్టు సంఘాల అభినంద‌న స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కానీ, అదే శాఖ‌కు చెందిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి ఆహ్వానం అంద‌లేదని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. అంతేకాదు.. టికెట్ల ధ‌ర‌ల పెంపులో 20 శాతం కార్మికుల‌కు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న విష‌యం కూడా త‌న దృష్టిలో లేద‌ని ఆయ‌న వాపోతున్నార‌ని స‌మాచారం. దీంతో మంత్రి ఇప్పుడు అలిగార‌ని.. కాంగ్రెస్‌లో చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వాస్త‌వ‌మో చూడాలి.