Begin typing your search above and press return to search.

మినిస్ట‌ర్ పోస్ట్ ప్లీజ్‌: రాహుల్‌కు కోమ‌టిరెడ్డి విన‌తి

తెలంగాణ‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు.. శ‌నివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీంతో భేటీ అయ్యారు.

By:  Garuda Media   |   7 Jun 2026 7:00 AM IST
మినిస్ట‌ర్ పోస్ట్ ప్లీజ్‌:  రాహుల్‌కు కోమ‌టిరెడ్డి విన‌తి
X

తెలంగాణ‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు.. శ‌నివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీంతో భేటీ అయ్యారు. వీరిలో ప్ర‌ముఖంగా మునుగోడు ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆయ‌న సుదీర్ఘ లేఖ‌ను రాహుల్‌గాంధీకి అప్ప‌గించారు. తాను పార్టీకి ఎంత విధేయుడినో ఆయ‌న వివ‌రించారు. 15 పేజీల లేఖ‌లో ప‌లు వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.

త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌న్న చ‌ర్చల నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి స‌హా.. సీనియ‌ర్ నాయ‌కు లు రాహుల్‌తోభేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. వాస్త‌వానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చి రెండున్నరేళ్లు పూర్త‌య్యాయి. ఇప్ప‌టికే ఒక‌సారి మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. అప్ప‌ట్లో అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ స‌హా.. మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌కు అవ‌కాశం క‌ల్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌కు ముందు ఈ కూర్పు జ‌రిగింది. అయితే.. ఇప్పుడు మ‌రోసారి విస్త‌రించాల‌ని చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఎప్ప‌టి నుంచో మంత్రి పీఠంపై ఆశ‌లు పెట్టుకున్న కోమ‌టిరెడ్డి మంత్రి పీఠం కోసం విస్తృ తంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మంత్రివ‌ర్గంలో సీటును ఆయ‌న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా కూడా భావి స్తున్నారు. గ‌త ఆరు మాసాల నుంచి త‌న వ్యాఖ్య‌ల ద్వారా మ‌రింత వేడి పుట్టిస్తున్నారు. త‌న‌కు మంత్రి వ‌ర్గంలో ఎందుకు చోటివ్వ‌రంటూ కోమ‌టిరెడ్డి ప్ర‌శ్నించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇక‌, రాష్ట్ర నేత‌లతో ప‌నికాద‌నుకున్న ఆయ‌న‌.. నేరుగా ఢిల్లీ పెద్ద‌ల‌కే విన్న‌వించారు.

ఇప్పుడైనా అవుతుందా?

అయితే.. ఇప్పుడైనా కోమ‌టిరెడ్డి ఆశ ఫ‌లిస్తుందా? అంటే.. క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. సీఎంరేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌న చేసిన కామెంట్లు.. అధిష్టానం వ‌ర‌కు చేరాయి. అదేస‌మ‌యంలో బీఆర్ ఎస్ నాయ‌కుల‌తో తెర‌వెనుక చేతులు క‌లిపార‌న్న వాద‌న కూడా ఉంది. దీనికి తోడు కోమ‌టిరెడ్డి కుటుంబంలో వెంక‌ట‌రెడ్డి ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. గ‌తంలో మునుగోడులో అర్ధంత‌రంగా రాజీనామా చేసి రాజ‌కీ యంగా వివాదం అయ్యారు. ఇలా.. అనేక ప్ర‌తిబంధ‌కాలు రాజాను వెంటాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు మంత్రి పీఠం ద‌క్క‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న ఉంది.