ఫుల్ ఫైర్ మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనరాని మాటలు!
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు తగ్గడం లేదు. తన అల్టిమేట్ డ్రీమ్ మంత్రి పదవిని అందుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 16 Aug 2025 11:37 AM ISTతెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు తగ్గడం లేదు. తన అల్టిమేట్ డ్రీమ్ మంత్రి పదవిని అందుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా మౌనంగా పైరవీలు చేసిన ఆయన ఇప్పుడు.. డైనమేట్ లా మారిపోయారు. నిత్యం ఫుల్ లోడెడ్ గన్ లా కనిపిస్తూ సందర్భం దొరికినప్పడల్లా మాటల తూటాలు పేల్చుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డనే టార్గెట్ గా చేసుకుని వాగ్బాణాలు సంధిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ లో చేర్చుకుని, ఇప్పుడు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని కొద్ది రోజులుగా మండిపడుతున్న రాజగోపాలరెడ్డి తాజాగా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవులు, పైసలు అన్నీ మీకే కావాలా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న రాజగోపాలరెడ్డి తాడోపేడో తేల్చుసుకుంటానన్న సంకేతాలిస్తున్నారు.
మంత్రి పదవి కోసమే ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాకపోవడంతో ఎదురుదాడి ముమ్మరం చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు రావడం లేదు..కాంట్రాక్టర్ పనిచేయడం లేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘రోడ్డు బిల్లు ముఖ్యమంత్రి ఇస్తే వస్తుంది. అందుకే ముఖ్యమంత్రిని ఉద్దేశించే అంటున్నా..’’ అని నేరుగా రేవంత్ రెడ్డి పేరు చెప్పి మరీ రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించడం చర్చనీయాంశం అవుతోంది.
20 నెలల నుంచి మునుగోడు నియోజకవర్గంలో రోడ్లకు బిల్డింగులకు ఒక్క రూపాయి కూడా రావట్లేదు. నేను మంత్రి దగ్గరకు వెళ్లి అడిగినా రాలేదు. వంద సార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. అలాంటప్పుడు పదవుల్లో మీరే..పైసలు మీరే తీసుకుంటున్నారని అడగాలా? వద్దా? పదవి విషయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. అది వచ్చేటప్పుడు ఎవ్వరు ఆపినా ఆగదు. పదవి వస్తే ప్రజలకే న్యాయం జరుగుతుంది’’ అని రాజగోపాలరెడ్డి వ్యాఖ్యానించారు. రెండో విడుత మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్‌కు ఛాన్స్ వస్తుందని ముందు ఆశించారు. కానీ, ఆయనకు పదవి దక్కకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రివర్గ విస్తరణ పూర్తయిన మరుక్షణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వాగ్బాణాలు సంధిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అడ్డు పడుతున్నారని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు
వాస్తవానికి తొలిసారి మంత్రివర్గ ఏర్పాటులోనే రాజగోపాల్ రెడ్డి పదవి కోసం గట్టి ప్రయత్నం చేశారని చెబుతున్నారు. కానీ అప్పట్లో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బెర్త్ ఇవ్వడతో రాజగోపాల్ రెడ్డికి చాన్స్ దక్కలేదు. ఆ తర్వాత రెండో విడతలో తప్పకవస్తుందని రాజగోపాల్ రెడ్డి ఆశించారు. ఈ సారి ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకున్న కాంగ్రెస్.. రాజగోపాల్ రెడ్డి ఆశలపై మళ్లీ నీళ్లు కుమ్మరించింది. అయితే కాంగ్రెస్ పార్టీ తన విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవేవో కారణాలు చెప్పి తనను మంత్రి కాకుండా అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి సీరియస్ అవుతున్నారు. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా రాజగోపాల్ రెడ్డ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
