Begin typing your search above and press return to search.

కొల్లు భావోద్వేగ బంధం...పేర్నికి చెక్ పడినట్లేనా ?

ఉమ్మడి క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాజీ మంత్రి పేర్ని నానిల మధ్య రాజకీయ సమరం రెండు దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది.

By:  Tupaki Desk   |   9 Jun 2025 10:00 AM IST
కొల్లు భావోద్వేగ బంధం...పేర్నికి చెక్ పడినట్లేనా ?
X

ఉమ్మడి క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాజీ మంత్రి పేర్ని నానిల మధ్య రాజకీయ సమరం రెండు దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఘనత పేర్ని నానికి దక్కింది. ఆనాడు ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కొల్లు రవీంద్ర ఓటమి పాలు అయ్యారు.

ఇక 2014లో పేర్ని నానిని కొల్లు రవీంద్ర ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2019 నాటికి సీన్ మారింది. కొల్లు రవీంద్రని ఓడించారు పేర్ని నాని. జగన్ కేబినెట్ లో మూడేళ్ళ పాటు మంత్రిగా వ్యవహరించారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసూన్నారు. 2024లో పేర్ని నాని తన కుమారుడిని వైసీపీ అభ్యర్ధిగా నిలబెట్టారు కానీ తెర వెనక అంతా ఆయన నడిపించారు. అయితే కొల్లు రవీంద్ర యాభి వేల ఓట్ల తేడాతో ఓడించారు.

ఇలా కొల్లు వర్సెస్ పేర్నిల మధ్య మచిలీపట్నంలో మహా రాజకీయం సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కొల్లు రవీంద్రకు కీలకమైన స్థానం దక్కుతోంది. ఆయన మంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన ఒకసారి గెలిచి ఒకసారి ఓడడం కాదు మళ్ళీ మళ్ళీ గెలవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి ఈసారి నుంచే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు.

ఆయన గత ఏడాది కాలంగా జనంతో అనుబంధాన్ని పెనవేసుకుని దానిని గట్టి పరచుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఒక వైపు చేస్తూ ప్రజలకు చేరువగా మరో వైపు ఉంటూ మచిలీపట్నాన్ని కంచుకోటగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బందరు పోర్టు ఆయన హయాంలో పూర్తి కానుంది. దాంతో రవీంద్రకే ఆ క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు.

అదే విధంగా బందరు పర్యాటక అవకాశాలను పెంచాలని చూస్తున్నారు. రేపల్లె మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చెయాలన్నది కూడా ప్రణాళికగా పెట్టుకున్నారు. ప్రాంతం అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు.

బందరు పోర్టును జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని ఆయన భారీ హామీ ఇస్తున్నారు. స్థానికంగా ఉన్న పల్లె తుమ్మలపాలెం లో క్రిటికల్ మినరల్ పార్కును ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. తద్వారా ఇక్కడి నుండి వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి ఆలోచిస్తున్నారు. బందరు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో ఉపాధికి కేంద్రంగా చేయడానికి చూస్తున్నారు

ఇవన్నీ ఒక ఎత్తు అయితే మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్ట్-2025 ని మంత్రి ఏర్పాటు చేశారు. ఈ బీచ్ ఫెస్టివల్ కి అద్భుతమైన స్పందన లభించింది. దాంతో ఆయన పెద్ద ఎత్తున ప్రజలు హాజరైన సభలో మాట్లాడుతూ తన చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తానని భావోద్వేగంతో కూడిన ప్రకటన చేశారు. ప్రజల అభిమానం తనకు సదా శ్రీ రామ రక్ష అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ బందరు బుల్లోడు గా తానే ఎప్పటికీ ఉండాలని చూస్తున్నారు.

ఇక తన వారసుడు పేర్ని కిట్టూని ఎమ్మెల్యేగా చేయాలని చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నానికి కొల్లు రవీంద్ర భావోద్వేగ బంధాన్ని ఎలా చేదించాలన్నది అతి పెద్ద సవాల్ గా మారుతుందని అంటున్నారు రానున్న రోజులలో పేర్ని కుటుంబం గేర్ మార్చకపోతే బందరు బుల్లోడుగా కొల్లు పాతుకుపోయే చాన్స్ ఉందని అంటున్నారు.