Begin typing your search above and press return to search.

గనుల శాఖలో ‘ఘనుడు’.. మంత్రి కొల్లు ఓఎస్డీకి ఉద్వాసన!

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీని తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో గనులశాఖలో పనిచేసిన మంత్రి ఓఎస్డీ పి.రాజబాబుపై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు ఉన్నాయనే ప్రచారం ఉంది.

By:  Tupaki Desk   |   11 April 2025 3:37 PM IST
గనుల శాఖలో ‘ఘనుడు’.. మంత్రి కొల్లు ఓఎస్డీకి ఉద్వాసన!
X

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీని తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో గనులశాఖలో పనిచేసిన మంత్రి ఓఎస్డీ పి.రాజబాబుపై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు ఉన్నాయనే ప్రచారం ఉంది. గనులశాఖలో జాయింట్ డైరెక్టరుగా రాజబాబు పనిచేశారు. 2024లో ఉద్యోగ విరమణ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనను ఓఎస్టీగా నియమించుకోవాలన మంత్రి కొల్లు రవీంద్ర భావించారు. ఆరోపణల నేపథ్యంలో ఆయన పేరును ప్రభుత్వం వెనక్కి పెట్టింది. కానీ, మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం రాజబాబు మాత్రమే ఓఎస్డీగా కావాలని పట్టుబట్టడంతో ప్రభుత్వం ఓకే చేసింది. ఇక ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజబాబుపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరడంతో రాజబాబును పక్కన పెట్టాలని ఆదేశించారు.

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీని తొలగించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మంత్రి కోరుకున్న అధికారే అయినా, ఆయన తీరుపై రోజురోజుకు ఫిర్యాదులు ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వం పక్కన పెట్టేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు పీఏలు, పీఎస్లు, ఓఎస్డీల తొలగింపులో ఇది రెండో సంఘటనగా చెబుతున్నారు. గతంలో హోంమంత్రి అనిత పీఏపైనా ఆరోపణలు రాగా, ఆమె తొలగించారు. ఇప్పుడు కొల్లు రవీంద్ర ఓఎస్డీపైనా అవే తరహా విమర్శలు రావడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది అంటున్నారు.

గనుల శాఖలో జేడీగా పనిచేస్తున్నప్పుడే రాజబాబుపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అలాంటి అధికారిని ఓఎస్డీగా పెట్టుకోవాలని మంత్రి రవీంద్ర అనుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ, మంత్రి అవేవీ లక్ష్య పెట్టలేదని అంటున్నారు. రాజబాబు మాత్రమే ఓఎస్డీగా కావాలని మంత్రి రవీంద్ర కోరుకోవడం విమర్శలకు గురైంది. అయితే మంత్రి ఒత్తిడితో రాజబాబును ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. ఈ పది నెలలో గనుల శాఖ పనితీరు, అప్పీల్ రివిజన్ కేసులపై అనేకానేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేషీకి చేరడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సీఎం ఆదేశించారు.

తన పనితీరుపై ఏకంగా సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారనే ప్రచారంతో రాజబాబు కూడా వెనక్కి తగ్గారు. కొద్దిరోజులుగా ఆయన తన కార్యాలయానికి కూడా రావడం మానేశారు. ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశం ఉందన్న ప్రచారంతో ముందుగానే అప్రమత్తమై తానే తప్పుకుంటున్నట్లు ప్రచారం చేసుకున్నారు. కానీ, ప్రభుత్వమే ఇప్పుడు ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.