Begin typing your search above and press return to search.

కొలికపూడిపై చర్యలు.. చంద్రబాబు తర్జనభర్జన

ఇక పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి ఎమ్మెల్యే కొలికపూడికి వ్యతిరేకంగా నివేదిక అందుకున్న అధినేత చంద్రబాబు తన నిర్ణయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు.

By:  Tupaki Political Desk   |   10 Nov 2025 11:00 PM IST
కొలికపూడిపై చర్యలు.. చంద్రబాబు తర్జనభర్జన
X

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 4న పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట ఎమ్మెల్యే హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలపై తన వాదన వినిపించారు. అయితే ఆయన వాదనను పూర్తిగా విన్న పార్టీ క్రమశిక్షణ సంఘం.. 8వ తేదీన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు నివేదిక సమర్పించింది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదంలో తప్పంతా ఎమ్మెల్యే కొలికపూడిదే అంటూ తేల్చేసింది. తొలి నుంచి ఆయన తీరు సరిగా లేదని, ఇప్పటికి మూడుసార్లు క్రమశిక్షణ సంఘం ఎదుట ఆయన హాజరయ్యారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్యేపై చర్యలకు సిఫార్సు చేసింది.

ఇక పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి ఎమ్మెల్యే కొలికపూడికి వ్యతిరేకంగా నివేదిక అందుకున్న అధినేత చంద్రబాబు తన నిర్ణయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు. దీంతో ఎప్పటిలా చంద్రబాబు నాన్చుడు వైఖరి అవలంబిస్తున్నారని, ఎమ్మెల్యే విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని కార్యకర్తల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిజానికి ఎమ్మెల్యే కొలికపూడి విషయంలో తిరువూరు నియోజకవర్గం సాధారణ కార్యకర్త నుంచి అధిష్టానం పెద్దల వరకు ఏ ఒక్కరికీ సానుకూల అభిప్రాయం లేకపోయినా, ఆయనపై ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవనే అంటున్నారు.

ఆరోపణలు, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా ఎమ్మెల్యే కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అధికారికంగా సస్పెండ్ చేయకుండా కొలికపూడి స్వతంత్రంగా బయటకు వెళ్లిపోయే వాతావరణం కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అని సీఎం పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సీనియర్లతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎమ్మెల్యే కొలికపూడి బలాలు, బలహీనతలపై సమగ్రంగా అధ్యయనం చేసి తనకు రహస్య నివేదిక ఇవ్వాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొలికపూడి అధికార బాధ్యతల్లో ఇమడలేకపోతున్నారని భావిస్తున్న సీఎం.. ఆయనను అన్నివిధాల నచ్చజెప్పి, పార్టీ కార్యకర్తలు, నేతల మనోభీష్టం మేరకు నడుచుకోవాలని మూడు సార్లు అవకాశమిచ్చారని, అయినా ఆయన మారకపోవడం వల్ల కొలికపూడితో మాట్లాడి ప్రయోజనం లేదని సీఎం ఒక అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అలా అని ఈ కారణంగా ఆయనను పార్టీ నుంచి బయటకు పంపితే, ప్రత్యర్థులకు ఒక ఆయుధంగా ఉపయోగపడే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అనుమానిస్తున్నారని అంటున్నారు. కొలికపూడిని బయటకు పంపితే, ఆయన రాజకీయంగా ఎవరికీ ఉపయోగపడ కూడదని సీఎం ఆలోచనగా ఉందని అంటున్నారు. అందుకే ఇప్పటికిప్పుడు కొలికపూడిపై చర్యలు తీసుకోకుండా, తగిన సమయం కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.