Begin typing your search above and press return to search.

కొలిక‌పూడి ఉద్య‌మ‌నేత‌గా సూప‌ర్ హిట్‌.. రాజ‌కీయ నేత‌గా ఫ‌ట్ ..?

కొలిక‌పూడిని గెలిపించ‌డానికి తిరువూరు కేడ‌ర్‌తో పాటు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని బాగా క‌ష్ట‌ప‌డ్డారు.

By:  Tupaki Desk   |   26 Oct 2025 9:00 AM IST
కొలిక‌పూడి ఉద్య‌మ‌నేత‌గా సూప‌ర్ హిట్‌.. రాజ‌కీయ నేత‌గా ఫ‌ట్ ..?
X

కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం ఏర్ప‌డిన జేఏసీలో ఏ స్థాయిలో కీ రోల్ ప్లే చేశారో ? ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా అక్క‌డ మాట‌ల తూటాలు పేల్చారో ? ఎంత‌లా ఎదిగారో ఇప్పుడు రాజ‌కీయాల్లో అందుకు భిన్నంగా రివ‌ర్స్‌లో ఎదురీదుతున్నారు. కొలిక‌పూడి శ్రీనివాస‌రావు పొలిటిక‌ల్ సైన్స్ పాఠాలు చెప్పి సివిల్స్ స‌ర్వీసుల‌కు ఎంపిక‌య్యేవారికి కోచింగ్ ఇచ్చారు. ఆ త‌ర్వాత అమ‌రావ‌తి జేఏసీలో కీల‌క పాత్ర పోషించ‌డం, మీడియా చ‌ర్చ‌ల్లో త‌న బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌డం ద్వారా ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఎందుకు ? కావాలో బ‌లంగా వివ‌రించారు. నాడు పార్టీల‌కు అతీతంగా కొలిక‌పూడికి ఫ్యాన్స్ పెరిగారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌కు తిరువూరు సీటు అనూహ్యంగా ద‌క్కింది. అమ‌రావ‌తి ప్రాంతానికే చెందిన కొలిక‌పూడి తన సొంత నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ లేదా గుంటూరు జిల్లాలో ప‌క్క‌నే ఉన్న ప్ర‌త్తిపాటు సీట్ల‌లో ఏదో ఒక‌టి కావాల‌ని నాడు చంద్ర‌బాబును అడిగిన మాట వాస్త‌వం. అక్క‌డ వేరే బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఉండ‌డంతో అనూహ్యంగా చంద్ర‌బాబు చివ‌రి క్ష‌ణంలో కొలికపూడిని తిరువూరుకు పంపారు. అప్పటికే అక్క‌డ దేవ‌ద‌త్ రెండేళ్లుగా క‌ష్ట‌ప‌డుతూ ప‌ని చేసుకుంటున్నారు. తిరువూరుకు కొలిక‌పూడికి అస్స‌లు సంబంధ‌మే లేదు. కూట‌మి వేవ్‌లో గెలిచిన కొలిక‌పూడి రాజ‌కీయంగా తాను పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే ఎమ్మెల్యే అయ్యారు. అందివ‌చ్చిన ఈ అవ‌కాశం వాడుకుని.. ఆయ‌న మ‌రింత బ‌ల‌మైన నేతగా మారితే త్వ‌ర‌లో మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది.

కొలిక‌పూడిని గెలిపించ‌డానికి తిరువూరు కేడ‌ర్‌తో పాటు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని బాగా క‌ష్ట‌ప‌డ్డారు. ఇద్ద‌రూ ఫ‌స్ట్ టైం గెలిచిన వారే... వారు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌ప‌డ‌కుండా వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తూ పార్టీకి, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. కొలిక‌పూడి టీవీ చ‌ర్చ‌ల్లో మాట్లాడ‌డం వేరు.. ప్రొఫెస‌ర్‌గా పాఠాలు చెప్ప‌డం వేరు.. దూరం నుంచి రాజ‌కీయాలు ప‌రిశీలించ‌డం వేరు.. రాజ‌కీయ‌క్షేత్రంలో నాయ‌కుడిగా ఉండ‌డం వేరు అన్న‌ది అర్థం చేసుకోలేక‌పోతున్నారు.

వివాదాల‌తో కాల‌క్షేపం చేస్తూ సొంత పార్టీకే చెందిన ఎంపీపై ఓపెన్‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ ఇష్యూలో త‌ప్పు ఎవ‌రిది అయినా కావ‌చ్చు. కొలిక‌పూడి ప్ర‌తి విష‌యాన్ని కెలుక్కుంటూ అధిష్టానంను ఇరుకున పెట్టేలా వెళుతున్నార‌న్న నివేదిక‌లు అధినేత‌కు వెళ్లిపోయాయి. బ‌హిరంగంగా రోడ్డుకు ఎక్క‌వ‌ద్దు అని అధినేత సూచ‌న‌ల‌ను కూడా ఆయ‌న పెడ‌చెవిన పెట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చివ‌ర‌కు ఆయ‌న నాయ‌క‌త్వాన్ని ప‌క్క‌న పెట్టేసి... తిరువూరులో కొత్త వ్య‌క్తికి ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇవ్వాల‌న్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఓడిపోయిన మాజీ మంత్రి కేఎస్‌. జ‌వ‌హ‌ర్‌ను తీసుకువ‌చ్చి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఆయ‌నే ఇక్క‌డ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం చేయాల‌న్న నిర్ణ‌యం కూడా తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటున్నారు. ఏదేమైనా ఉద్య‌మ‌నేత‌గా సూప‌ర్ హిట్ అయిన కొలిక‌పూడి.. రాజ‌కీయ నేత‌గా యేడాదికే ఫ‌ట్ అనిపించుకున్నారు.