Begin typing your search above and press return to search.

'ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడలేను'.. కోహ్లి కామెంట్ రోహిత్ గురించేనా?

గత మూడు సీజన్ల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక నిబంధనపై చర్చ జరుగుతోంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్.

By:  Tupaki Desk   |   4 Jun 2025 12:01 PM
ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడలేను.. కోహ్లి కామెంట్ రోహిత్ గురించేనా?
X

గత మూడు సీజన్ల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక నిబంధనపై చర్చ జరుగుతోంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్. దీనిని సమర్థంచేవారు ఉన్నారు.. విమర్శించేవారు ఉన్నారు. క్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే ఇలాంటి నిబంధనలు అమలవుతోంది. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతున్న సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ముగిసిన సీజన్ లోనూ ఈ విధానంపై చర్చ నడిచింది. కాకపోతే.. ఐపీఎల్ కేవలం టైమ్ పాస్ కోసం కాబట్టి దీనిమీద వివాదం అనవసరం.

18వ సీజన్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ను చాలా మ్యాచ్ లలో ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపడం గమనార్హం. ఈ సీజన్ ప్రారంభంలో రోహిత్ విఫలం కావడంతో అతడి సేవలను ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వాడుకున్నారు. తద్వారా 38 ఏళ్ల రోహిత్ కు కొంత మేలు చేశారనే చెప్పాలి. అయితే, అభిమానులకు ఇది రుచించలేదు. మొన్నటివరకు కెప్టెన్ గా గ్రౌండ్ లో ఆధిపత్యం చెలాయించిన రోహిత్ ను ఇంపాక్ట్ సబ్ గా డగౌట్ లో వారు ఊహించుకోలేకపోయారు.

అయితే, మంగళవారం టైటిల్ కొట్టిన అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండలేనని.. 20 ఓవర్ల పాటు గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేసి ఇంపాక్ట్ చూపేందుకే ఇష్టపడతానని కోహ్లి పేర్కొన్నాడు. తాను ఆ తరహా ఆటగాడినని తెలిపాడు.

ఈ సీజన్ లో ఫామ్ రీత్యా రోహిత్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తొలిసారి దింపారు. కోహ్లి మాత్రం 567 పరుగులతో చెలరేగాడు. తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలు రోహిత్ ను ఉద్దేశించినవే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కోహ్లి, రోహిత్ గత ఏడాది టి20 ప్రపంచ కప్ విజయం అనంతరం ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. తాజాగా ఐపీఎల్ జరుగుతుండగానే.. టెస్టు ఫార్మాట్ కు రోహిత్, కోహ్లి బైబై చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇక కొన్నాళ్లుగా రోహిత్-కోహ్లి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గ్రౌండ్ లో వీరిద్దరూ అవేమీ కనిపించనీయలేదు. అచ్చమైన ప్రొఫెషనల్ క్రికెటర్ల మాదిరిగా వ్యవహరించారు.