కోహినూర్ వజ్రం నిజమైన యజమాని ఎవరు?
ప్రపంచంలోని అత్యంత అమూల్యమైన రత్నాలలో ఒకటైన కోహినూర్ వజ్రం శతాబ్దాలుగా గొప్ప చరిత్రను కలిగి ఉంది.
By: Tupaki Desk | 8 April 2025 9:22 AM ISTకోహినూర్ వజ్రం.. ప్రపంచానికి పరిచయం చేయాల్సిన పని లేని అరుదైన రత్నం. దీని విలువ 20 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో 1.7 లక్షల కోట్లు. అయితే ఇంతటి విలువైన రత్నాన్ని కొట్టేసింది ఎవరు? అసలు ఈ వజ్రానికి నిజమైన యజమాని ఎవరు? అన్నది ఎప్పుడూ చర్చగానే ఉంది.
ప్రపంచంలోని అత్యంత అమూల్యమైన రత్నాలలో ఒకటైన కోహినూర్ వజ్రం శతాబ్దాలుగా గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఈ వజ్రం చాలామంది పాలకుల చేతులు మారింది. ఎన్నో సామ్రాజ్యాల చరిత్రను చూసింది. దాని ప్రకాశం చరిత్ర అంతటా ప్రజలను నిరంతరం ఆకర్షిస్తూనే ఉంది.
అయితే ఈ వజ్రాన్ని మొట్టమొదట కనిపెట్టింది ఆంధ్రప్రదేశ్‌లో. సుమారు 800 సంవత్సరాల క్రితం కోహినూర్ వజ్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని గోల్కొండ గనుల నుండి తవ్వారు. ఆ సమయంలో అప్పటివరకు కనుగొన్న అతిపెద్ద వజ్రం ఇదే. దీని బరువు సుమారు 186 క్యారెట్లు. ఈ విలువైన రత్నాన్ని కనిపెట్టింది కాకతీయుల జమానాలో కాబట్టి. కాకతీయ రాజవంశం పాలకులే యజమానులు అయ్యారు. వారు దానిని తమ దేవత భద్రకాళి విగ్రహం ఎడమ కంటిలో ఉంచారు.
14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సంవత్సరాలుగా ఇది మొఘల్ చక్రవర్తి బాబర్‌ను చేరుకోవడానికి ముందు చాలామంది రాజులు, పాలకుల మధ్య చేతులు మారింది. 1739లో పర్షియన్ పాలకుడు నాదిర్ షా మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాను ఓడించి, ఢిల్లీని స్వాధీనం చేసుకుని, కోహినూర్ వజ్రాన్ని తనతో తీసుకెళ్లాడు.
కోహినూర్ వజ్రం చివరికి పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ ఖజానాలోకి ప్రవేశించింది. అయితే 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్‌ను తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, ఆ వజ్రాన్ని బ్రిటన్ రాణి విక్టోరియాకు సమర్పించారు. నేడు కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజ కిరీటంలో భాగం. లండన్ టవర్‌లో ఉంచారు. గోల్కొండ నుంచి లండన్ టవర్ వరకూ ప్రయాణించిన ఈ ఒక్క వజ్రం విలువ లక్ష కోట్లు పై మాటే. ఇది నిజంగా వేల ఎపిసోడ్ల సిరీస్ కి, ఫ్రాంఛైజీ సినిమా కథలకు ఎంతమాత్రం తీసిపోని చరిత్రను కలిగి ఉంది. కేవలం కోహినూర్ కథతో పాన్ ఇండియన్ సినిమాలు తీస్తే లక్షల కోట్లు ఖజానాకు జమ అయ్యి ఉండేవేమో!
